క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తో ‘చోటూ’(ఫైల్)
పంజాబ్ రాష్ట్రంలోని లూథియానా జిల్లాలో మారుమూల గ్రామం బల్లోకే. ఈ గ్రామ జనాభా 700. అందరూ వ్యవసాయం చేస్తారు. ఈ గ్రామంలో జన్మించిన సత్నామ్ ఎత్తు 7 అడుగుల 2 అంగుళాలు. అయితే ఈ ఆజానుబాహుడిని ఆ ఊరిలో అందరూ ‘చోటూ’ అని పిలుస్తారు. ఎందుకంటే ఆ ఊళ్లో అతనికంటే ఎత్తుగా ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారట. సత్నామ్ తండ్రి బల్బీర్ సింగ్ ఎత్తు కూడా 7.2 అడుగులు. ఆయన గోధుమలు పండిస్తారు.
తొమ్మిదేళ్ల వయసు వరకు సత్నామ్‌కు బాస్కెట్‌బాల్ అంటే ఏంటో తెలియదు. ఆ తర్వాత స్కూల్‌లో ఈ ఆట గురించి తెలిసి ఆసక్తి పెంచుకున్నాడు. ఆ గ్రామంలో ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో 12 ఏళ్ల వయసులో సమీప పట్టణంలోని అకాడమీలో చేర్పించారు. కానీ అక్కడ కూడా సదుపాయాలు లేవు. అయినా కష్టపడ్డాడు. తనలో ఉన్న నైపుణ్యానికి ఎత్తు అదనపు బలంగా మారింది. అంతే... జాతీయ స్థాయిలో బాస్కెట్‌బాల్ పెద్దలను ఆకర్షించాడు.
దీంతో 2010లో ఫ్లోరిడాలోని ఐఎంజీ రిలయన్స్ అకాడమీలో మూడు నెలల శిక్షణ కోసం మరో 29 మందితో కలిసి వెళ్లే అవకాశం లభించింది. ఇది తన తలరాతను మార్చింది. అక్కడ సత్నామ్ నైపుణ్యం చూసి ఇక మళ్లీ భారత్‌కు పంపించలేదు. అక్కడే ఐఎంజీ అకాడమీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ చిన్న చిన్న లీగ్‌లు ఆడాడు. ఇప్పుడు అనూహ్యంగా ఎన్‌బీఏలో అడుగుపెడుతున్నాడు. ఈ ఘనతతో భారత బాస్కెట్‌బాల్‌లో చోటూ సూపర్ హీరోగా మారాడు.
యావో మింగ్ మాదిరిగా..!
భారత్ అంటే క్రికెట్... ఇక్కడ బాస్కెట్‌బాల్‌కు పెద్దగా ఆదరణ లేదు. పాఠశాలలు, కళాశాలల్లో అక్కడక్కడా కనిపించినా పెద్దగా పట్టించుకోరు. కానీ అమెరికాలో ఈ క్రీడ అంటే పిచ్చి. ఎన్‌బీఏ మ్యాచ్‌ల కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తారు. మైకేల్ జోర్డాన్ లాంటి దిగ్గజం ఆడిన ఆ సర్క్యూట్‌లో మన దేశం నుంచి ఓ క్రీడాకారుడు ఆడతాడనేది ఇప్పటిదాకా ఊహకు అందని విషయం. ఈ సీజన్‌లో భుల్లర్ అనే భారత సంతతి ఆటగాడు (కెనడా) ఎన్‌బీఏలో ఆడాడు.
ఇప్పుడు సత్నామ్ కేవలం 19 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించడం నిజంగా చాలా గొప్ప విషయం. బాస్కెట్‌బాల్ ఇప్పటికే ఆడుతున్న యువకులంతా సత్నామ్ స్ఫూర్తిగా మరింత కష్టపడతారు. గతంలో చైనాలోనూ బాస్కెట్‌బాల్‌కు ఆదరణ లేదు. అయితే అక్కడి నుంచి యావో మింగ్ వెళ్లి ఎన్‌బీఏలో ఆడిన తర్వాత ఆ దేశంలో విపరీతంగా ఆదరణ పెరిగింది. ఇవ్వాళ చైనా ఆసియాలో పెద్ద శక్తిగా ఎదిగింది. యావో మింగ్ తరహాలోనే సత్నామ్ కూడా భారత్‌లో ఆట రాతను మారిస్తే అంతకంటే కావల్సింది ఏముంటుంది.
-సాక్షి క్రీడావిభాగం