సత్నామ్ సంచలనమ్!
♦ ఎన్‌బీఏ లీగ్‌లోకి ఎంపికైన తొలి భారత ఆటగాడిగా చరిత్ర
♦ డల్లాస్ మావెరిక్స్ జట్టుకు ఎంపిక
న్యూయార్క్ : భారత్‌కు చెందిన యువ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్నామ్ సింగ్ భమరా కొత్త చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని ప్రఖ్యాత నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)లీగ్‌లో ఆడేందుకు ఈ 19 ఏళ్ల క్రీడాకారుడు ఎంపికయ్యాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు సత్నామ్. గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన ఎన్‌బీఏ డ్రాఫ్ట్‌లో ఇతడిని ‘డల్లాస్ మావెరిక్స్’ జట్టు ఎంపిక చేసుకుంది. అలాగే దశాబ్ద కాలంలో కళాశాల లేక ప్రొఫెషనల్ అనుభవం లేని ఆటగాడు ఎన్‌బీఏకు ఎంపికవడం కూడా ఇదే తొలిసారి.
2005లో డ్రాఫ్ట్ అర్హత నిబంధనల ప్రకారం డ్రాఫ్ట్‌లోకి రావాలంటే ఓ ఆటగాడు హైస్కూల్‌లో ఏడాదిపాటు ఎన్‌బీఏ ‘డి’ లీగ్‌లో ఆడాలి. లేదా విదేశాల్లో ప్రొఫెషనల్‌గా ఆడిన అనుభవమైనా ఉండాలి. కానీ ఇవేమీ సత్నామ్ సింగ్‌కు లేవు. అతడికున్న అత్యున్నత అనుభవమల్లా భారత జాతీయ జట్టుకు ఆడటమే. సత్నామ్‌ను తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని డల్లాస్ జట్టు యజమాని మార్క్ క్యూబన్ అన్నారు. ఇప్పుడు తమ జట్టుకు భారత్ రూపంలో వంద కోట్లకు పైగా అభిమానులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
ప్రశంసల వర్షం : సత్నామ్ సింగ్‌పై భారత్‌లో ప్రశంసల జల్లు కురుస్తోంది. ‘ఈ వార్త తెలిసి చాలా సంతోషపడ్డాను. ఓ భారత ఆటగాడికి ఇది పెద్ద ఘనత. అందరూ గర్వించదగ్గ విషయం. రాబోయే సీజన్‌తో పాటు కెరీర్‌లో మెరుగ్గా రాణించాలని కోరుకుంటున్నాను. కచ్చితంగా భారత్ అంతా అతడి వెనుకే ఉంటుంది’ అని సచిన్ అన్నాడు. కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, గుత్తా జ్వాల, ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ ఐపీఎల్ జట్లు సత్నామ్‌కు అభినందనలు తెలిపాయి.
ఇది కలా.. నిజమా అనే స్థితిలో ఉన్నాను. కానీ నేను ఎన్‌బీఏలో చోటు సాధించాననే విషయం వాస్తవం. భగవంతుడి దయతో నా కల నిజం చేసుకున్నాను. ఈ సమయంలో నా కుటుంబం, తొలి కోచ్ సుబ్రమణ్యంలను తలచుకోకుండా ఉండలేను. ఈ ఫీట్‌తో భారత్ నుంచి కూడా చాలా మంది వర్ధమాన ఆటగాళ్లు నాలాగే పెద్ద ఆశయాలు పెట్టుకునేందుకు అవకాశం కలిగింది. కచ్చితంగా రాబోయే రోజుల్లో బాస్కెట్‌బాల్‌కు భారత్‌లో ఆదరణ పెరుగుతుంది. ఇప్పుడు క్రికెట్‌ను ఆభిమానించినట్టే ఈ ఆటను కూడా చూస్తారు.
- సత్నామ్