విధి మన ఆటను సడన్‌గా మారుస్తుంది. మనం ఏదో గోల్ అనుకుని వెళుతూ ఉంటాం. అది గేమ్‌ను తిరగేసేస్తుంది. పరిగెత్తేవారిని కూచుండి పోయేట్టు... కూచున్నవారిని పాకుతూ వెళ్లేట్టు చేస్తుంది విధి. అయితే మనం ఓడిపోతామా? కొత్త ఆట మొదలెడతాం. కొత్త గోల్‌ను సెట్ చేసుకుంటాం. బంతి ఎప్పుడూ విధి చేతిలోనే ఉండదు. మన దగ్గరికీ వస్తుంది. అప్పుడు లాగి పెట్టి కొట్టడమే. కశ్మీర్‌కు చెందిన ఇష్రత్ అఖ్తర్ చేస్తుంది అదే. అల్లర్ల వల్ల కాళ్లు పోగొట్టుకున్నా వీల్ చైర్ బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా స్ఫూర్తినిస్తోందా అమ్మాయి.
ఈ సంవత్సరం అంతా సజావుగా జరిగి ఆగస్ట్‌లో ‘పారలింపిక్స్’ (దివ్యాంగుల ఒలింపిక్స్) టోక్యోలో జరిగితే మనం ఇష్రత్ అఖ్తర్ పేరు తప్పక వింటాం. ఆ అమ్మాయి భారతదేశం తరుఫున ఆ పోటీలలో వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ టీమ్‌లో ఆడనుంది. ఇప్పటికే థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా–ఓషెనియా వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో దేశం తరఫున ఆడిన ఇష్రత్ గొప్ప ప్రతిభను ప్రదర్శించింది. కోవిడ్ వల్ల 2020లో జరగాల్సిన పారలింపిక్స్ 2021కు జరపబడ్డాయి. అయినా సరే ఉత్సాహం నీరుగారిపోకుండా బారాముల్లాలోని తన ఇంటి వద్దే రేయింబవళ్లు ప్రాక్టీస్ చేస్తోంది ఇష్రత్. అయితే ఇంత ప్రావీణ్యం ఉన్న అమ్మాయి నిజంగా బాస్కెట్‌బాల్ ప్లేయర్ కాదు. విధి విసిరిన సవాలుకు ఆమె అలా స్పందించింది.
మేడ మీద నుంచి దూకేసి
ఇష్రత్ అఖ్తర్‌ది బారాముల్లాలోని బంగ్‌దారా అనే గ్రామం. 2016లో ఆమెకు 19 ఏళ్లు. చదువుకుంటోంది. కాని ఆ సంవత్సరం కశ్మీర్‌లో అతి పెద్ద ఉగ్రవాది అయిన బర్హాన్ వని ఎన్‌కౌంటర్ జరిగింది. జూలైలో ఈ ఎన్‌కౌంటర్ జరిగితే అప్పటి నుంచి జమ్ము కాశ్మీర్ అంతా నిరసనలు అల్లర్లు పెరిగిపోయాయి. ఆగస్టు 24న కొందరు కుర్రాళ్లు భద్రతా దళాల మీద రాళ్లు విసురుతూ ఇష్రత్ ఇంట్లోకి వచ్చి దాక్కున్నారు. వారిని వెంటాడుతూ వచ్చిన భద్రతా దళాలు ఇష్రత్ ఇంటిని చుట్టుముట్టాయి. ఇష్రత్ ఈ గొడవకి గందరగోళానికి బాగా భయపడిపోయి తన ఇంటి రెండో అంతస్తుకు చేరుకుంది. కుర్రాళ్ల వల్ల లేదంటే లోపలికి వచ్చిన భద్రతాదళాల వల్ల ఏం జరుగుతుందోనని కంగారులో పై నుంచి దూకేసింది. అంతే ఆమెకు ఆ తర్వాత ఏమీ తెలియదు. కళ్లు తెరిచే సరికి రెండు కాళ్లూ చలనం కోల్పోయాయి. ఆమె వెన్నుముకకు సర్జరీ చేసినా పెద్దగా ఉపయోగం లేకపోయింది.
6 నెలలు మంచాన ఉండి..
‘హాస్పిటల్ నుంచి నన్ను ఇంటికి తెస్తే అందరూ శవం వచ్చినట్టుగానే శోకం ప్రకటించారు. చలనం లేని నా దేహం శవమే కదా. ఆరునెలలు మంచాన ఉన్నాను. చాలా డిప్రెషన్ వచ్చింది. అప్పుడు మా నాన్న అబ్దుల్ రషీద్ దగ్గరలో ఉన్న ఒక స్వచ్ఛంద సంస్థకు తీసుకెళ్లడం మొదలెట్టాడు. అక్కడంతా నాలాంటి వాళ్లే. అవయవాలు కోల్పోయిన వాళ్ళు’ అంది ఇష్రత్.
‘ఆమె తనలాంటి వాళ్లను చూసి ధైర్యం తెచ్చుకోవాలని ఆ పని చేశాను’ అంటాడు అబ్దుల్ రషీద్.
అక్కడే కొందరు దివ్యాంగులు వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఆడుతుంటే ఇష్రత్‌కు కూడా ఆసక్తి కలిగింది. వెళ్లి వాళ్లతో ఆడటం మొదలెట్టింది. అప్పటి వరకూ ఆమెకు ఆ ఆట గురించి ఏమీ తెలియకపోయినా ఆమె ఆడుతున్న పద్ధతి చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఆ సమయంలోనే శ్రీనగర్‌లో జరుగుతున్న వీల్‌చైర్ బాస్కెట్ బాల్ ప్లేయర్‌ల క్యాంప్ గురించి ఇష్రత్‌కు తెలిసింది. తండ్రితో అక్కడకు వెళితే సెలెక్టర్లు ఆమె ప్రతిభను చూసి నేషనల్ టీమ్‌కు సెలెక్ట్ చేశారు. మొత్తం జమ్ము కశ్మీర్ నుంచి ఒక్క ఇష్రతే ఇందుకు సెలెక్ట్ అయ్యింది.
చెన్నైకు వెళ్లి
2020లో టోక్యోలో జరగనున్న పారాలింపిక్స్‌లో పాల్గొనడానికి చెన్నైలో ‘వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (డబ్లు్యబిఎఫ్‌ఐ) నేషనల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అది ఆగస్టు 2019. సరిగ్గా ఆ సమయంలోనే జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుతో కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించింది. నేషనల్ టీమ్ మెంబర్‌గా ట్రయినింగ్ తీసుకోవాల్సిన ఇష్రత్‌కు అసలు సమాచారమే అందలేదు. కాని ఆగస్టు 25న కోచ్ లూయిస్ జార్జ్ ఒక రిటైర్డ్ ఇంటెలిజన్స్ అధికారితో యధాలాపంగా ఈ ప్రస్తావన చేస్తే ఆ అధికారి తన సోర్స్ ద్వారా సైన్యానికి ఈ సంగతి చేరవేసి హుటాహుటిన ఇష్రత్‌ను చెన్నై వచ్చేలా చేశారు. భారత సైన్యం ఇందుకు సహకరించింది. చెన్నైకు చేరిన ఇష్రత్ ఆ తర్వాత థాయ్‌లాండ్‌లో విశేష ప్రతిభ కనిపించడంతో ఆమె జీవితమే మారిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆమెను ప్రశంసించింది. ప్రోత్సహించింది.
‘నన్ను నా వంటి వారిని స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు ఇమ్మని పిలుస్తున్నారు’ అంటోంది ఇష్రత్.
ఇష్రత్ నిజంగానే స్ఫూర్తి ఇస్తోంది. కాళ్లు లేకపోతే ఏమి. రెక్కల్లో బలం ఉంది. ఆమె ఎగురుతూనే ఉంటుంది. గోల్స్ కొడుతూనే ఉంటుంది.
– సాక్షి ఫ్యామిలీ
ఆట ఆడుతూ ఉండు
Published Sat, Jan 23 2021 12:21 AM | Last Updated on Sat, Jan 23 2021 4:04 AM
Comments
Please login to add a commentAdd a comment