లెబ్రాన్ జేమ్స్ (PC: Instagram)
లాస్ ఏంజెలిస్ (అమెరికా): విఖ్యాత బాస్కెట్‌బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్ ట్వీట్లు, పోస్ట్‌లకు విరామం ఇస్తానని ప్రకటించి తన అభిమానులను కాస్త నిరాశపరిచాడు. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)లో ఆల్‌టైమ్ బెస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్న అతనికి ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (పాత ట్విట్టర్)లో కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. జేమ్స్ ఆకస్మిక నిర్ణయానికి కారణం లేకపోలేదు.
సమాజానికి తన సైలెన్స్‌తో సందేశం ఇవ్వడానికే సోషల్ మీడియాకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. అతని సహచరుడు కెవిన్ డ్యురంట్ మేనేజర్ రిచ్ క్లీమన్ ఇటీవల సోషల్ మీడియాలో పెరిగిపోతున్న అసత్య, ప్రతికూల వార్తలు మన కళ్లను గుడ్డిగా నమ్మేలా చేయడంపై ప్రముఖంగా ప్రస్తావించాడు.
దీన్ని ఉటంకిస్తూ... వైరల్ అవుతున్న వార్తల్లో ‘రియల్’ కనిపించకపోవడం తనని కూడా కదిలించేలా చేసిందని, అందుకే ఈ విరామం అని లెబ్రాన్ జేమ్స్ చెప్పాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 159 మిలియన్లు (15 కోట్ల 90 లక్షల మంది), ‘ఎక్స్’లో 52.9 మిలియన్ల (5 కోట్ల 20 లక్షల 90 వేల మంది) అభిమానులు లెబ్రాన్‌ను సోషల్ మీడియాలో అనుసరిస్తారు.
అతని ట్వీట్‌కు జై కొడతారు... పోస్ట్ పెడితే పండగ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్లందరూ తమ సూపర్‌స్టార్ ముచ్చట్లు లేక వెలవెలబోనున్నారు. ఎన్‌బీఏలో జేమ్స్ జగద్విఖ్యాత బాస్కెట్‌బాలర్. త్వరలోనే 40వ పడిలో అడుగిడబోతున్నా... ఈ వెటరన్ స్టార్‌కు ఆటపై పస, ధ్యాస ఏమాత్రం తగ్గలేదు. ఎన్‌బీఏలో నాలుగుసార్లు, ఒలింపిక్స్‌లో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టులో సభ్యుడైన లెబ్రాన్ లాస్ ఏంజెలిస్ లేకర్స్‌కు ఆడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment