![Satnam Singh Bhamara handed two-year doping ban by NADA - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/25/SATNAM.jpg.webp?itok=bqZAlEbM)
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్‌బీఏ) జట్టుకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఘనతకెక్కిన సత్నాం సింగ్ భమారా డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో 25 ఏళ్ల భమారాపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణా ప్యానెల్ గురువారం ప్రకటించింది. బెంగళూరులో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనే సత్నాం సింగ్ డోపీగా తేలడంతో రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేశారు.
దీన్ని సవాలు చేసిన సత్నాం డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (ఏడీడీపీ)తో విచారణ జరిపించాలని ‘నాడా’ను కోరాడు. ఈ విచారణలో సత్నాం ‘వాడా’ నిషేధిత ఉత్ప్రేరకం హైజినమైన్‌ను తీసుకున్నట్లు తేలిందని ‘నాడా’ గురువారం నిర్ధారించింది. గతేడాది నవంబర్ నుంచే శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొన్న జాతీయ సంస్థ 19 నవంబర్ 2021 వరకు అతను ఎలాంటి టోర్నీల్లో ఆడరాదంటూ నిషేధం విధించింది. ఐదేళ్ల క్రితం ఎన్‌బీఏ డెవలప్‌మెంట్ లీగ్‌లో టెక్సాస్ లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన భమారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా చాంపియన్‌షిప్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్, 2019 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.
Comments
Please login to add a commentAdd a comment