National basketball assocation
-
తండ్రి, తనయుడు కలిసి.. ఎన్బీఏలో కొత్త చరిత్ర
లాస్ ఏంజెలిస్: నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ)లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎన్బీఏ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన దిగ్గజ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్‌తో పాటు... అతడి కుమారుడు బ్రోనీ జేమ్స్ ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగారు. తద్వారా ఎన్బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రీ కొడుకులుగా వీరు రికార్డుల్లోకెక్కారు. లీగ్‌లో భాగంగా లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మంగళవారం మినెసొటా టింబర్వోల్వస్ జట్టుతో జరిగిన పోరులో కలిసి ఆడారు. సుదీర్ఘ ఎన్బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రి కుమారులు లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మాత్రమే కావడం విశేషం. 39 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ ఇప్పటి వరకు ఎన్బీఏలో 40,490 పాయింట్లు సాధించి ఈ జాబితా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 20 ఏళ్ల బ్రోనీ జేమ్స్ ఈ సీజన్లోనే ఎన్బీఏ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ రెండో క్వార్టర్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రోనీ కోర్టులోకి అడుగు పెట్టాడు. దీంతో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించగా... తండ్రి సూచనలు పాటిస్తూ బ్రోనీ రెండున్నర నిమిషాల పాటు ఆటలో కొనసాగాడు. బ్రోనీ మైదానాన్ని వీడే సమయంలో కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేశారు. గత వేసవిలో జరిగిన వేలంలోనే లేకర్స్ జట్టు బ్రోనీ జేమ్స్‌ను దక్కించుకోగా... ఇప్పుడు సీజన్ ఆరంభ పోరుతో తండ్రీ కుమారులు కలిసి ఆడే అవకాశం దక్కింది. బ్రోనీ బరిలోకి దిగడానికి ముందు లెబ్రాన్ మాట్లాడుతూ... ‘సిద్ధంగా ఉన్నావా. మ్యాచ్ తీవ్రత గమనించావు కదా... ఒత్తిడికి లోనవకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించు’ అని అన్నాడు. పొరబాట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని... మైదానంలో వంద శాతం కష్ట పడటంపైనే దృష్టి పెట్టాలని సూచించాడు. మ్యాచ్‌లో లెబ్రాన్ జేమ్స్ 16 పాయింట్లతో సత్తా చాటగా... లేకర్స్ జట్టు 110– 103 పాయింట్ తేడాతో టింబర్వోల్వస్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు లెబ్రాన్ భార్య, బ్రోనీ తల్లి సవన్నా జేమ్స్ కూడా హాజరై... భర్త, కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. బేస్‌బాల్ మేజర్ లీగ్‌లో కెన్ గ్రెఫీ సీనియర్ అతడి కుమారుడు కెన్ గ్రెఫీ జూనియర్ ఇలాంటి అరుదైన రికార్డు సాధించారు. 1990వ దశకంలో వీరిద్దరూ 51 మ్యాచ్‌ల్లో కలిసి ఆడారు. మంగళవారం ఎన్బీఏ మ్యాచ్‌కు హాజరైన కెన్ గ్రెఫీ జంట... జేమ్స్ ద్వయాన్ని అభినందించింది. నాలుగుసార్లు ఎన్బీఏ చాంపియన్‌గా నిలిచిన లెబ్రాన్ చాన్నాళ్ల క్రితమే కుమారుడితో కలిసి ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అప్పటికి బ్రోనీ విద్యార్థి దశలోనే ఉండగా... ఆ తర్వాత కఠోర శిక్షణతో రాటుదేలిన బ్రోనీ టీనేజ్లోనే తన ప్రతిభతో లేకర్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది కార్డియాక్ అరెస్ట్‌కు గురైన బ్రోనీ జేమ్స్... ఓపెన్ హార్ట్ సర్జరీ నుంచి కోలుకొని తిరిగి ఆట కొనసాగిస్తున్నాడు. -
LeBron James: సంచలనం.. 40 ఏళ్ల రికార్డు కనుమరుగు
నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(NBA) స్టార్ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్ చరిత్ర సృష్టించాడు. నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును ఈ ఏన్బీఏ ప్లేయర్ తాజాగా బద్దలుకొట్టాడు. లేకర్స్ తరపున ఆడుతున్న లెబ్రాన్ జేమ్స్ బుధవారం ఎన్బీఏ ఆల్ టైమ్ పాయింట్స్ స్కోరింగ్(38,387) అందుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు కరీమ్ అబ్దుల్ జబ్బార్ పేరిట ఉంది. ఒక్లహమా సిటీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో 36వ పాయింట్ వద్ద లెబ్రాన్ జేమ్స్ ఈ ఫీట్ అందుకున్నాడు. ప్రస్తుతం లెబ్రాన్ జేమ్స్ ఖాతాలో 38,388 పాయింట్లు ఉన్నాయి. లెబ్రాన్ ఈ రికార్డు అందుకున్న సమయంలో స్డేడియంలో దిగ్గజం కరీమ్ అబ్దుల్ జబ్బార్ ఉండడం విశేషం. వేలాది మంది ప్రేక్షకుల కరతాళద్వనుల మధ్య అబ్దుల్ జబ్బార్.. లెబ్రాన్ జేమ్స్‌ను అభినందించడం హైలైట్‌గా నిలిచింది. ఇక ఆగస్టు 5, 1984లో అప్పటి ఎన్బీఏ స్టార్ కరీమ్ అబ్దుల్ జబ్బార్ 31,419 పాయింట్ల వద్ద విల్ట్ చాంబర్లెయిన్ను అధిగమించాడు. 1989లో కరీమ్ రిటైర్ అయినప్పటికి అతని రికార్డు మాత్రం చెక్కుచెదరలేదు. 2003-04 సీజన్ లో అరంగేట్రం చేసిన లెబ్రాన్ జేమ్స్.. తొలి సీజన్ మినహా తర్వాత ప్రతి సీజన్ లోనూ ఒక్కో మ్యాచ్ కు సగటున 25 పాయింట్లు స్కోరు చేయడం గమనార్హం. లెబ్రాన్ జేమ్స్ సాధించిన రికార్డులు.. ► NBA ఛాంపియన్: 2012, 2013, 2016, 2020 ► NBA మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP): 2009, 2010, 2012, 2013 ► NBA ఫైనల్స్ MVP: 2012, 2013, 2016, 2020 ► NBA ఆల్ స్టార్: 19 సార్లు (2005-2023) ► NBA రూకీ ఆఫ్ ది ఇయర్: 2004 ► ఒలింపిక్ పతకాలు: మూడు (2008, 2012లో స్వర్ణం; 2004లో కాంస్యం) 🎙️ MIC'D UP 🎙️ LeBron James becomes the NBA's all-time leading scorer.#ScoringKing pic.twitter.com/MbRSyw0SBj — NBA (@NBA) February 8, 2023 One photo, 76,777 points. All time greatness. #ScoringKing pic.twitter.com/EJdWZTQZe6 — NBA (@NBA) February 8, 2023 చదవండి: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో Lebron James: ఎన్బీఏ స్టార్ క్రేజ్ మాములుగా లేదు; ఒక్క టికెట్ ధర 75 లక్షలు -
సత్నాం సింగ్‌పై రెండేళ్ల నిషేధం
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక జాతీయ బాస్కెట్‌బాల్ సంఘం (ఎన్బీఏ) జట్టుకు భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తొలి బాస్కెట్‌బాల్ ప్లేయర్‌గా ఘనతకెక్కిన సత్నాం సింగ్ భమారా డోపింగ్‌లో దొరికిపోయాడు. దీంతో 25 ఏళ్ల భమారాపై రెండేళ్ల నిషేధం విధిస్తున్నట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) క్రమశిక్షణా ప్యానెల్ గురువారం ప్రకటించింది. బెంగళూరులో దక్షిణాసియా క్రీడల సన్నాహక శిబిరం సందర్భంగా గతేడాది నవంబర్‌లో నిర్వహించిన పరీక్షల్లోనే సత్నాం సింగ్ డోపీగా తేలడంతో రెండేళ్ల సస్పెన్షన్ వేటు వేశారు. దీన్ని సవాలు చేసిన సత్నాం డోపింగ్ నిరోధక క్రమశిక్షణా కమిటీ (ఏడీడీపీ)తో విచారణ జరిపించాలని ‘నాడా’ను కోరాడు. ఈ విచారణలో సత్నాం ‘వాడా’ నిషేధిత ఉత్ప్రేరకం హైజినమైన్ను తీసుకున్నట్లు తేలిందని ‘నాడా’ గురువారం నిర్ధారించింది. గతేడాది నవంబర్ నుంచే శిక్ష అమల్లోకి వస్తుందని పేర్కొన్న జాతీయ సంస్థ 19 నవంబర్ 2021 వరకు అతను ఎలాంటి టోర్నీల్లో ఆడరాదంటూ నిషేధం విధించింది. ఐదేళ్ల క్రితం ఎన్బీఏ డెవలప్మెంట్ లీగ్‌లో టెక్సాస్ లెజెండ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన భమారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయునిగా చరిత్ర సృష్టించాడు. ఆసియా చాంపియన్‌షిప్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్, 2019 ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. -
బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ దుర్మరణం
కాలిఫోర్నియా: అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ ఓ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బ్రియాంట్ కుమార్తె గియానాతో పాటు మరో ముగ్గురు మృతి చెందారు. ఆదివారం తన ప్రయివేట్ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న బ్రియాంట్ లాస్ఏంజిల్స్కు 65 కిలోమీటర్ల దూరంలోని క్యాలబసస్‌లో ఒక్కసారిగా కుప్పకూలింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలియాయి. ఇక ఈ ప్రమాదానికి గల కారణాల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్రియాంట్ అకాల మరణంపై అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు విచారం వ్యక్తం చేశారు. అమెరికా ఓ దిగ్గజ ఆటగాడిని కోల్పోయిందని, అతడు దేశంలో బాస్కెట్‌బాల్ అభివృద్దికి విశేషకృషి చేశాడని ప్రశంసించారు. అంతేకాకుండా అమెరికా క్రీడా చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు. వీరితో పాటు అమెరికన్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్(ఎన్బీఏ) సంతాపం తెలుపుతూ అతడి మరణం ఎన్బీఏకు తీరని లోటని తెలిపింది. ‘బ్రియాంట్, అతడి కుమార్తె మరణవార్త తెలిసి షాక్‌కు గురయ్యాను. ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు’ అంటూ తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక ఈ దిగ్గజ ఆటగాడి మృతితో యావత్ క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఈ దిగ్గజ క్రీడాకారుడి మరణావార్త విని అమెరికా ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. అక్కడి అన్ని టీవీ ఛానళ్ల న్యూస్ రీడర్లు అతడి మరణవార్తను తెలుపుతూ కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా అనేకచోట్ల అతడికి సంతాపం తెలుపుతూ పలు కార్యక్రమాలు చేపట్టారు. 'బ్లాక్ మాంబా'గా బాస్కెట్ బాల్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న ఈ దిగ్గజ ఆటగాడు.. దాదాపు 20 ఏళ్లకు పైగా తన ఆటతో అభిమానులను అలరించాడు. అంతేకాకుండా అత్యధిక గోల్స్ సాధించిన టాప్ ప్లేయర్స్‌లలో కోబ్ బ్రియంట్ ఒకడిగా నిలిచాడు. -
జూనియర్ ఫైవ్ ఘనవిజయం
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్బీఏ జామ్ టోర్నమెంట్లో జూనియర్ ఫైవ్, హెర్డ్వాల్స్ జట్లు ఘనవిజయాలు సాధించాయి. బంజారాహిల్స్‌లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజి గ్రౌండ్స్‌లో గురువారం మొదలైన ఈ టోర్నమెంట్లో జూనియర్ ఫైవ్ 21-5తో రామన్ హీట్ జట్టుపై గెలుపొందగా, హెర్డ్వాల్స్ 17-2తో భవాన్స్ జట్టు (సైనిక్‌పురి)ను కంగుతినిపించింది. ఇతర పోటీల్లో ఆర్మీ స్కూల్-1 జట్టు 14-2తో గ్లాడియేటర్స్ జట్టుపై నెగ్గగా, ఎక్స్పాండ్ జట్టు 9-15తో అవంతి జట్టు చేతిలో ఓడింది. ఫ్లయింగ్ లాన్సర్స్ 7-4తో విజార్డ్స్‌పై, చైతన్య చాంపియన్స్ 14-1తో రాకెట్స్ జట్టుపై, హార్డ్‌కోర్ జట్టు 16-7తో ఈగల్స్ జట్టుపై, ది ఫాక్స్ట్రాట్స్ 5-4తో ఫాంటమ్స్పై, ఏపీఎస్ఆర్కేపీ 11-5తో ఎస్ఎన్టీపై గెలుపొందాయి. మరో మ్యాచ్‌లో ఈగల్స్ జట్టుకు 5-15తో కేపీహెచ్‌బీ చేతిలో పరాజయం ఎదురవగా, వైఎంసీఏ కాలేజి 15-8తో ఎంజీఎంపై, పంపర్స్ 16-3తో ఎంజీఎం సీబీఎస్ఈపై, నైట్ 7-4తో లయోలా అకాడమీపై విజయం సాధించాయి. స్ట్రయికర్స్ 6-12తో బ్లాకర్స్ చేతిలో ఓడగా, ఎంజేసీఈటీ 11-3తో రైజింగ్ స్టార్స్‌పై గెలిచింది. బ్లేజింగ్ డ్రిబ్లర్స్ 3-7తో వెస్లీ పిస్టన్స్ చేతిలో, షూటర్స్ 5-12తో నూగెట్స్ చేతిలో, క్రాసింగ్ మీటరైడ్స్ 6-9తో బీవీఆర్ఐటీ చేతిలో కంగుతిన్నాయి.