ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగిన దిగ్గజం లెబ్రాన్ జేమ్స్, అతని కుమారుడు బ్రోనీ జేమ్స్
లాస్ ఏంజెలిస్: నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్‌బీఏ)లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎన్‌బీఏ చరిత్రలో అత్యధిక పాయింట్లు సాధించిన దిగ్గజ ఆటగాడు లెబ్రాన్ జేమ్స్‌తో పాటు... అతడి కుమారుడు బ్రోనీ జేమ్స్ ఒకే మ్యాచ్‌లో బరిలోకి దిగారు. తద్వారా ఎన్‌బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రీ కొడుకులుగా వీరు రికార్డుల్లోకెక్కారు. లీగ్‌లో భాగంగా లాస్ ఏంజెలిస్ లేకర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మంగళవారం మినెసొటా టింబర్‌వోల్వస్ జట్టుతో జరిగిన పోరులో కలిసి ఆడారు.
సుదీర్ఘ ఎన్‌బీఏ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడిన తండ్రి కుమారులు లెబ్రాన్ జేమ్స్, బ్రోనీ జేమ్స్ మాత్రమే కావడం విశేషం. 39 ఏళ్ల లెబ్రాన్ జేమ్స్ ఇప్పటి వరకు ఎన్‌బీఏలో 40,490 పాయింట్లు సాధించి ఈ జాబితా అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 20 ఏళ్ల బ్రోనీ జేమ్స్ ఈ సీజన్‌లోనే ఎన్‌బీఏ అరంగేట్రం చేశాడు. మ్యాచ్ రెండో క్వార్టర్ మరో నాలుగు నిమిషాల్లో ముగుస్తుందన్న సమయంలో బ్రోనీ కోర్టులోకి అడుగు పెట్టాడు. దీంతో అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించగా... తండ్రి సూచనలు పాటిస్తూ బ్రోనీ రెండున్నర నిమిషాల పాటు ఆటలో కొనసాగాడు.
బ్రోనీ మైదానాన్ని వీడే సమయంలో కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేశారు. గత వేసవిలో జరిగిన వేలంలోనే లేకర్స్ జట్టు బ్రోనీ జేమ్స్‌ను దక్కించుకోగా... ఇప్పుడు సీజన్ ఆరంభ పోరుతో తండ్రీ కుమారులు కలిసి ఆడే అవకాశం దక్కింది. బ్రోనీ బరిలోకి దిగడానికి ముందు లెబ్రాన్ మాట్లాడుతూ... ‘సిద్ధంగా ఉన్నావా. మ్యాచ్ తీవ్రత గమనించావు కదా... ఒత్తిడికి లోనవకుండా స్వేచ్ఛగా ఆడేందుకు ప్రయత్నించు’ అని అన్నాడు. పొరబాట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని... మైదానంలో వంద శాతం కష్ట పడటంపైనే దృష్టి పెట్టాలని సూచించాడు.
మ్యాచ్‌లో లెబ్రాన్ జేమ్స్ 16 పాయింట్లతో సత్తా చాటగా... లేకర్స్ జట్టు 110– 103 పాయింట్ తేడాతో టింబర్‌వోల్వస్ జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు లెబ్రాన్ భార్య, బ్రోనీ తల్లి సవన్నా జేమ్స్ కూడా హాజరై... భర్త, కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. బేస్‌బాల్ మేజర్ లీగ్‌లో కెన్ గ్రెఫీ సీనియర్ అతడి కుమారుడు కెన్ గ్రెఫీ జూనియర్ ఇలాంటి అరుదైన రికార్డు సాధించారు. 1990వ దశకంలో వీరిద్దరూ 51 మ్యాచ్‌ల్లో కలిసి ఆడారు. మంగళవారం ఎన్‌బీఏ మ్యాచ్‌కు హాజరైన కెన్ గ్రెఫీ జంట... జేమ్స్ ద్వయాన్ని అభినందించింది.
నాలుగుసార్లు ఎన్‌బీఏ చాంపియన్‌గా నిలిచిన లెబ్రాన్ చాన్నాళ్ల క్రితమే కుమారుడితో కలిసి ఆడాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. అప్పటికి బ్రోనీ విద్యార్థి దశలోనే ఉండగా... ఆ తర్వాత కఠోర శిక్షణతో రాటుదేలిన బ్రోనీ టీనేజ్‌లోనే తన ప్రతిభతో లేకర్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత ఏడాది కార్డియాక్ అరెస్ట్‌కు గురైన బ్రోనీ జేమ్స్... ఓపెన్ హార్ట్ సర్జరీ నుంచి కోలుకొని తిరిగి ఆట కొనసాగిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment