
అదే నా చెత్త ప్రదర్శన: ఆమ్లా
డర్బన్ : ఇటీవల భారత్ లో జరిగిన టెస్టు సిరీస్ లో తన ఆట తీరు అత్యంత పేలవంగా ఉందని దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ హషీమ్ ఆమ్లా పేర్కొన్నాడు. ప్రత్యేకంగా ఢిల్లీ టెస్టు మ్యాచ్ లో ఆడిన తీరే తనను ఎక్కువగా నిరాశకు గురి చేసిందని.. ఈ ఏడాది కాలంలో ఇదే తన అత్యంత చెత్త ప్రదర్శనగా చెప్పుకోవచ్చని ఆమ్లా స్పష్టం చేశాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి టెస్టులో 241 పరుగుల తేడాతో ఓటమి పాలైన అనంతరం అత్యంత చెత్త ప్రదర్శన అనే ప్రశ్నకు ఆమ్లా పై విధంగా బదులిచ్చాడు.
ప్రతి ఒక్కరి కెరీర్ లో చెత్త ప్రదర్శన అనేది చాలా నిరాత్సహానికి గురి చేస్తుందన్నాడు. ఒకసారి పేలవంగా ఆడితే ఎంతటి స్థాయి క్రికెటర్ అయినా అనుకోకుండానే నమ్మకాన్ని కోల్పోతాడన్నాడు. దాని నుంచి బయటపడటానికి ఎంతకాలం పడుతుందో కచ్చితంగా చెప్పడం కష్టమన్నాడు. తాను 2014 లో టెస్టు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాక ఘన విజయాలను సాధించిన సంగతిని ఈ సందర్భంగా ఆమ్లా గుర్తు చేశాడు. గతేడాది జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్లపై సిరీస్ లను గెలిచి ముందంజలో పయనిస్తే.. ఈ ఏడాది మాత్రం బంగ్లాదేశ్ తో సిరీస్ డ్రా చేసుకోవడంతో పాటు భారత్తో సిరీస్ కోల్పోవడం తీవ్ర నిరాశను కలగచేసిందన్నాడు.