
వాలెన్సియా (స్పెయిన్): ఫుట్‌బాల్... అర్జెంటీనా... ఈ రెండింటిది విడదీయలేని బంధం. మొదటిది ‘ఆట’యితే... రెండోది ఆ ఆటలో మేటి జట్టు. భారత్‌లో క్రికెట్ మతమైతే, ప్రపంచానికి ‘ఫుట్‌బాల్’ ఊపిరి! సాకర్ వరల్డ్ కప్ ఈ జగతినే ఏకం చేస్తుంది. జగాన్ని ఊపేస్తుంది. అలాంటి ఆటలో... అండర్– 20 విభాగంలో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన ఎదురులేని జట్టుకు ఊహించని షాకిచ్చింది యువ భారత్. ఊహకందని విజయంతో భారత ఫుట్‌బాల్ చరిత్రలో నిలిచింది. ‘కాటిఫ్ కప్’ అండర్–20 టోర్నమెంట్‌లో భారత్ 2–1తో అర్జెంటీనానే కంగుతినిపించింది. ఈ చిరస్మరణీయ విజయంలో దీపక్ తాంగ్రి (4వ ని.), అన్వర్ అలీ (68వ ని.) చెరో గోల్ చేసి భాగస్వాములయ్యారు.
కీలకమైన సమయంలో రెండో అర్ధభాగం మొదలైన 9 నిమిషాలకే ఫార్వర్డ్ ఆటగాడు జాదవ్ ‘రెడ్ కార్డు’తో మైదానం వీడాల్సి వచ్చింది. ఇలాంటి దశలో కేవలం 10 మందితోనే మిగతా ‘మిషన్’ను పూర్తి చేయడం విశేషం. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ పోరులో భారత్ అద్భుత ప్రదర్శనతో ఆరుసార్లు అండర్–20 ప్రపంచ చాంపియన్స్ అయిన అర్జెంటీనాపై ఘనవిజయం సాధించింది. భారత గోల్ కీపర్ ప్రభ్‌సుఖన్ గిల్ గోల్ పోస్ట్ ముందు కళ్లు చెదిరే ప్రదర్శనతో అర్జెంటీనాను నిలువరించాడు. ద్వితీయార్ధంలోని ఆట 56వ, 61వ నిమిషాల్లో ప్రత్యర్థి గోల్ చేసేదే! కానీ అత్యంత చురుగ్గా, వేగంగా స్పందించిన ప్రభ్‌సుఖన్ ఆ రెండు సార్లు అర్జెంటీనా అవకాశాల్ని నీరుగార్చాడు. ‘ప్రపంచ ఫుట్‌బాల్‌లో భారత్‌కు గౌరవం పెంచిన విజయం ఇది. మేటి జట్లను కూడా దీటుగా ఎదుర్కొనే సత్తా భారత్‌కు ఉందని గుర్తించే ఫలితమిది. ఆలిండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) బాధ్యతను పెంచిన విజయం’ అని భారత కోచ్ ఫ్లాయిడ్ పింటో చెప్పారు.
ఇరాక్‌పై అండర్–16 జట్టు గెలుపు
జోర్డాన్‌లో జరిగిన పశ్చిమాసియా ఫుట్‌బాల్ సమాఖ్య (డబ్ల్యూఏఎఫ్‌ఎఫ్) టోర్నమెంట్‌లో భారత అండర్– 16 జట్టు 1–0తో ఆసియా చాంపియన్ ఇరాక్‌ను కంగుతినిపించింది. ఈ మ్యాచ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను భువనేశ్ సాధించాడు. ఏ వయో విభాగంలోనైనా ఇరాక్‌పై భారత్ సాధించిన తొలి విజయమిది.
Comments
Please login to add a commentAdd a comment