
ధోనీ.. నిన్ను మిస్సయ్యాం
రాంచీ: జార్ఖండ్ రాజధాని రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియం తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు ఈ వేదికలోనే జరగనుంది. అయితే రాంచీవాసులు ఎంతో అభిమానించే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆటను ఈ మ్యాచ్‌లో చూసే అవకాశం లేకుండాపోయింది. ప్రపంచ క్రికెట్లో రాంచీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన ధోనీ బ్యాటింగ్‌ను సొంతగడ్డపై ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ లేకపోవడాన్ని లోటుగా భావిస్తున్నారు. ధోనీ స్వస్థలం రాంచీయే. అతను ఇక్కడే క్రికెట్ ఓనమాలు నేర్చుకుని ప్రపంచ అత్యుత్తమ కెప్టెన్‌లలో ఒకడిగా ఎదిగాడు. స్కూలు రోజుల్లో ధోనీ మొదట ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఆ తర్వాతే క్రికెట్ బ్యాట్ పట్టాడు.
ఏదో ఒకరోజు రిటైరవ్వాల్సిందేనని, ధోనీ అకస్మాత్తుగా టెస్టు క్రికెట్ నుంచి వైదొలగడంతో అభిమానులు బాధపడ్డారని, సొంతగడ్డపై జరిగే తొలి టెస్టులో అతను ఆడకపోవడం ఒకింత బాధగా ఉందని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ అన్నాడు. రాంచీలో జరిగిన తొలి టి-20, వన్డే మ్యాచ్‌లలో ధోనీ టీమిండియాకు సారథ్యం వహించాడు. అయితే టెస్టు మ్యాచ్ కు నాయకత్వం వహించే అవకాశం రాలేదు.
ధోనీ మరో కోచ్ చంచల్ భట్టాచార్య మాట్లాడుతూ.. 'రాంచీలో టెస్టు మ్యాచ్ జరుగుతుందని మేమెప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు ఊహించని కల సాకారమవుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో రాంచీ ముద్దుబిడ్డ ధోనీ ఆడటం లేదు. ఈ మ్యాచ్‌లో మహీ ఆడకపోవడం రాంచీకే కాదు జార్ఖండ్ వాసులందరికీ వెలితిగా ఉంది. బాధగానే ఉన్నా టెస్టుల నుంచి రిటైరవ్వాలని ధోనీ నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ ఆడకపోయినా ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీగా తరలి వస్తారని ఆశిస్తున్నా' అని చెప్పాడు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు ధోనీ కుటుంబ సభ్యులను నిర్వాహకులు ఆహ్వానించారు.