భారత్, పాకిస్తాన్
అండర్–19 ప్రపంచకప్‌లో భారత జట్టు అసాధారణ ఫామ్‌లో ఉంది. గత రన్నరప్ అయిన యువ భారత్ ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఓటమన్నదే ఎరుగదు. తిరుగులేని విజయాలిచ్చిన ఆత్మవిశ్వాసంతో ఉన్న కుర్రాళ్లు నేడు అసలు సిసలు సవాల్‌కు సిద్ధమయ్యారు. కీలకమైన సెమీస్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీ కొనేందుకు సై అంటే సై అంటున్నారు.
క్రైస్ట్‌చర్చ్: అసలే యువ భారత్ జోరుమీదుంది. టోర్నీ లో ఎదురులేని విజయాలందుకుంది. వరుసగా రెండో సారి ఫైనల్ చేరేందుకు తహతహలాడుతోంది. దీనికితోడు కుర్రాళ్లకు ఐపీఎల్ వేలం ఇచ్చిన కిక్కు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ నేపథ్యంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తుచేసి తమ జైత్రయాత్రను కొనసాగించాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్తాన్ కూడా చెప్పుకోదగ్గ విజయాలతో సెమీఫైనల్ చేరింది. దీంతో మంగళవారం అండర్–19 ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరు జరగనుంది. ఇరు యువ జట్లు 2014 తర్వాత మళ్లీ ఇప్పుడే తలపడుతున్నాయి.
ద్రవిడ్ మార్గదర్శనంలో...
కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శనంలో యువ జట్టు అద్భుత విజయాలను సాధిస్తూ సెమీస్ చేరింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నిలకడను కనబరుస్తోంది. బ్యాటింగ్‌లో శుభ్‌మాన్ గిల్, కెప్టెన్ పృథ్వీ షా, మన్‌జ్యోత్ కల్రా చక్కని ఫామ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియాతో భారీ స్కోరుకు, భారీ విజయానికి ఈ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెనే కారణం. ఈ ముగ్గురితో పాటు విశేషంగా రాణిస్తోన్న బౌలర్లు నాగర్‌కోటి, శివమ్ మావిని ఐపీఎల్ ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. వీరిద్దరూ స్పిన్నర్ అనుకూల్ రాయ్‌తో కలిసి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పతిప్పలు పెడుతున్నారు. అర్షదీప్ కూడా అడపాదడపా రాణిస్తున్నాడు. పాక్ జట్టులో జైద్ అలమ్, అలీ జరియబ్, కెప్టెన్ హసన్ ఖాన్ ఫామ్‌లో ఉన్నారు. పేసర్ షహీన్ ఆఫ్రిది నిప్పులు చెరిగే బౌలింగ్‌తో జట్టును గెలిపిస్తున్నాడు. సులేమాన్‌తో పాటు హసన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.
భారత్: పృథ్వీ షా (కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, ఆర్యన్ జుయల్, అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్, హార్విక్ దేశాయ్, మన్‌జ్యోత్ కల్రా, కమలేశ్ నాగర్‌కోటి, పంకజ్ యాదవ్, ఇషాన్ పోరెల్, హిమాన్షు రాణా, అనుకూల్ రాయ్, శివమ్ మావి, శివ సింగ్.
పాకిస్తాన్: హసన్ ఖాన్ (కెప్టెన్), రొహైల్ నజీర్, మొహమ్మద్ అలీఖాన్, అలీ జరియబ్, అమద్ ఆలమ్, ఇక్బాల్, ఇమ్రాన్ షా, తాహ, మోసిన్ ఖాన్, మూసా, జైద్, రియాజ్, సాద్ ఖాన్, షహీన్ ఆఫ్రిది, సులేమాన్ షఫ్‌ఖత్.
అంతిమ పోరుకు ఆసీస్
అఫ్గాన్ జోరుకు సెమీస్‌లో చెక్
క్రైస్ట్‌చర్చ్: అండర్–19 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్ జోరుకు సెమీఫైనల్లో బ్రేక్ పడింది. సోమవారం జరిగిన సెమీస్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 48 ఓవర్లలో 181 పరుగులు చేసి ఆలౌటైంది. టాపార్డర్ బ్యాట్స్‌మన్ ఇక్రామ్ (80; 8 ఫోర్లు) ఒంటరి పోరాటం చేయగా... మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఆసీస్ పేసర్లలో మెర్లో 4, ఇవాన్స్ 2 వికెట్లు తీశారు. తర్వాత యువ ఆస్ట్రేలియా జట్టు 37.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ ఎడ్వర్డ్స్ (72; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. పరమ్ ఉప్పల్ (32 నాటౌట్) ఫర్వాలేదనిపించాడు. ఖయీస్ 2 వికెట్లు తీశాడు. నేడు భారత్, పాక్ జట్ల జరిగే రెండో సెమీస్ విజేతతో ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియా తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment