
‘వర్షం’తో ముగింపు
తొలి రెండు వన్డేల్లో ప్రత్యర్థి బౌలింగ్ ధాటికి బెదిరిన భారత బ్యాట్స్‌మెన్‌కు ఈసారి ఆ అవసరం రాలేదు. టెస్టు సిరీస్‌కు ముందు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేద్దామనుకున్న టీమిండియాకు ఆ అదృష్టమూ దక్కలేదు. భారీ వర్షం కారణంగా మూడో వన్డే... ధోనిసేన బ్యాటింగ్‌కు దిగకుండానే రద్దయింది. ప్రత్యర్థి ఇన్నింగ్స్ ఆసాంతం దరికిరాని వాన, మనకు మాత్రం అడ్డుగా నిలిచింది. సెంచరీల హోరుతో పరుగుల వర్షం కురిపించిన దక్షిణాఫ్రికా మరోసారి మన బౌలర్ల బలహీనతను బయట పెట్టింది.
సెంచూరియన్: సిరీస్‌లో ఒక్క వన్డే అయినా నెగ్గి పరువు నిలబెట్టుకుందామనుకున్న భారత్ ఆశలు తీరలేదు. ఇక్కడి సూపర్ స్పోర్ట్స్ పార్క్ మైదానంలో బుధవారం జరిగిన మూడో వన్డే భారీ వర్షం కారణంగా రద్దయింది. దక్షిణాఫ్రికా పూర్తి ఇన్నింగ్స్‌ను 50 ఓవర్ల పాటు ఆడగా...భారత్‌కు మాత్రం బ్యాటింగ్‌కు అవకాశం లేకుండా పోయింది. ఇన్నింగ్స్ విరామంలో ప్రారంభమైన వాన నిరంతరాయంగా దాదాపు రెండున్నర గంటల పాటు కురిసింది. దాంతో మరో దారి లేక అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఫలితంగా తొలి రెండు వన్డేలు నెగ్గిన దక్షిణాఫ్రికా 2-0తో సిరీస్ గెలుచుకుంది. మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 301 పరుగులు చేసింది. క్వాంటన్ డి కాక్ (120 బంతుల్లో 101; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) వరుసగా మూడో సెంచరీ సాధించగా, కెప్టెన్ ఏబీ డివిలియర్స్ (101 బంతుల్లో 109; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా శతకంతో చెలరేగాడు. చివర్లో మిల్లర్ (34 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడాడు. చాలా కాలం తర్వాత చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో ఇషాంత్ శర్మ (4/40) ఆకట్టుకున్నాడు. షమీకు 3 వికెట్లు దక్కాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఈ నెల 18 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది.
ఇషాంత్‌కు 4 వికెట్లు...
టాస్ గెలిచిన డివిలియర్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ జట్టులో మూడు మార్పులు చేయగా, భారత జట్టులో రహానే స్థానంలో మళ్లీ యువరాజ్ వచ్చాడు. గత రెండు వన్డేల తరహాలో ఈ సారి దక్షిణాఫ్రికా ఓపెనర్లు శుభారంభం ఇవ్వడంలో విఫలమయ్యారు. భారత బౌలర్లు మొదటినుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆమ్లా (13), డి కాక్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు.
షమీ తన మొదటి ఓవర్లోనే ఆమ్లాను అవుట్ చేసి భారత్‌కు తొలి వికెట్ అందించాడు. మరో వైపు చాలా కాలం తర్వాత ఇషాంత్ శర్మ కూడా చక్కటి బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. డేవిడ్స్ (1), డుమిని (0) స్లిప్స్‌లో రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.
కీలక భాగస్వామ్యం...
28/3 స్కోరుతో దక్షిణాఫ్రికా ఇబ్బందికర స్థితిలో నిలిచింది. అయితే ఈ సమయంలో డి కాక్, డివిలియర్స్ కలిసి సమన్వయంతో ఆడారు. చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. భారత ఫీల్డర్ల వైఫల్యం కూడా డి కాక్‌కు కలిసొచ్చింది. ఉమేశ్ బౌలింగ్‌లో 13 పరుగుల వద్ద షార్ట్ ఫైన్ లెగ్‌లో రహానే, అశ్విన్ బౌలింగ్‌లో 17 పరుగుల వద్ద మిడాన్‌లో యువరాజ్ అతను ఇచ్చిన క్యాచ్‌లు వదిలేశారు. కోహ్లి బౌలింగ్‌లో 2 సిక్స్‌లతో దూసుకుపోయిన కాక్...ఈ క్రమంలో 116 బంతుల్లో వరుసగా మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
మరో వైపు అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం షమీ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి డివిలియర్స్ జోరు పెంచాడు. ఎట్టకేలకు డి కాక్‌ను ఇషాంత్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ భారీ భాగస్వామ్యానికి తెర పడింది. అయితే డివిలియర్స్ తగ్గలేదు. అశ్విన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన అతను 96 బంతుల్లోనే కెరీర్‌లో 16వ సెంచరీని అందుకున్నాడు. డివిలియర్స్‌తో పాటు మరో ముగ్గురు ఆటగాళ్లు త్వరగానే వెనుదిరిగినా...మిల్లర్ తన ధాటిని కొనసాగించడంతో దక్షిణాఫ్రికా స్కోరు 300 పరుగులు దాటింది. ఈ ఏడాది భారత్ పదో సారి 300కు పైగా పరుగులు ఇచ్చి రికార్డు నెలకొల్పడం విశేషం.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: ఆమ్లా (సి) యువరాజ్ (బి) షమీ 13; డి కాక్ (బి) ఇషాంత్ 101; డేవిడ్స్ (సి) రైనా (బి) ఇషాంత్ 1; డుమిని (సి) రైనా (బి) ఇషాంత్ 0; డివిలియర్స్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 109; మిల్లర్ (నాటౌట్) 56; మెక్లారెన్ (సి) ఉమేశ్ (బి) ఇషాంత్ 6; పార్నెల్ (సి) రోహిత్ (బి) షమీ 9; ఫిలాండర్ (బి) షమీ 0; సోట్సోబ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 2, వైడ్ 3) 5; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 301.
వికెట్ల పతనం: 1-22; 2-28; 3-28; 4-199; 5-252; 6-269; 7-291; 8-298.
బౌలింగ్: ఇషాంత్ 10-1-40-4; ఉమేశ్ 9-0-57-1; షమీ 10-0-69-3; అశ్విన్ 9-0-63-0; జడేజా 6-0-32-0; రైనా 3-0-16-0; కోహ్లి 3-0-22-0.
16 ఇషాంత్ వన్డేల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 16వ బౌలర్ ఇషాంత్.