
సూపర్ రాహుల్
జింబాబ్వే పర్యటనలో భారత జట్టు శుభారంభం చేసింది. లోకేశ్ రాహుల్ (115 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 1సిక్సర్) అజేయ సెంచరీకి...
రెండు పరుగులు చేస్తే భారత్ గెలుస్తుంది... కానీ సిక్సర్ కొడితే రికార్డు సృష్టించొచ్చు. ఇలాంటి స్థితిలో భారత ఓపెనర్ లోకేశ్ రాహుల్ సంచలన షాట్ ఆడాడు. సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకుని... అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. బౌలింగ్‌లో బుమ్రా విజృంభణ, బ్యాటింగ్‌లో టాపార్డర్ నిలకడతో జింబాబ్వేతో తొలి వన్డేలో భారత్ 9 వికెట్లతో ఘన విజయం సాధించింది.
* అరంగేట్రంలోనే సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు
* చెలరేగిన బుమ్రా, రాణించిన రాయుడు
* జింబాబ్వేపై 9 వికెట్లతో భారత్ విజయం
హరారే: జింబాబ్వే పర్యటనలో భారత జట్టు శుభారంభం చేసింది. లోకేశ్ రాహుల్ (115 బంతుల్లో 100 నాటౌట్; 7 ఫోర్లు, 1సిక్సర్) అజేయ సెంచరీకి... రాయుడు (120 బంతుల్లో 60; 5 ఫోర్లు) నిలకడ తోడవడంతో ధోనిసేన 9 వికెట్ల తేడాతో జింబాబ్వేపై ఘనవిజయం సాధించింది.
హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49.5 ఓవర్లలో 168 పరుగులకే అలౌటైంది. చిగుంబురా (65 బంతుల్లో 41; 1 ఫోర్) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు సాధించాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా (4/28) అద్భుతంగా రాణించగా... ధవల్ కులకర్ణి, బరిందర్ శరణ్ చెరో రెండు వికెట్లను దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 42.3 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 173 పరుగులు చేసి విజయం సాధించింది. జింబాబ్వే బౌలర్ చటారాకు ఒక వికెట్ దక్కింది. మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో వన్డే సోమవారం జరుగుతుంది.
తడబడిన జింబాబ్వే: ఈ మ్యాచ్ ద్వారా భారత్ తరఫున రాహుల్, చాహల్, కరుణ్ నాయర్ వన్డేల్లో అరంగేట్రం చేశారు. భారత బౌలర్లంతా ఆరంభం నుంచి కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఏ దశలోనూ జింబాబ్వే ఇన్నింగ్స్ సాఫీగా సాగలేదు. పేసర్ల నిలకడతో ఒక దశలో 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను చిగుంబుర, రజా (23) కలిసి ఆదుకున్నారు. అయినా భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో జింబాబ్వే స్వల్ప స్కోరుకే పరిమితమయింది.
రికార్డు సెంచరీ: కెరీర్‌లో తొలి వన్డే ఆడిన కరుణ్ నాయర్ (7) నిరాశ పరిచినా... మరో ఓపెనర్ లోకేశ్ రాహుల్ నిలకడగా ఆడాడు. రాయుడు, రాహుల్ నిలదొక్కుకునే వరకూ బాగా నెమ్మదిగా ఆడటంతో ఇన్నింగ్స్ నత్తనడకన సాగింది. ఒకసారి కుదురుకున్నాక రాహుల్ వేగం పెంచాడు.
దీంతో 57 బంతుల్లో తన అర్ధసెంచరీ పూర్తయింది. రెండో ఎండ్‌లో రాయుడు పూర్తిగా సింగిల్స్‌కే పరిమితమై రాహుల్‌కు స్ట్రయికింగ్ ఇచ్చాడు. 93 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన రాయుడు... ఇన్నింగ్స్ చివరి దశలో రాహుల్ సెంచరీ కోసం సింగిల్స్‌తో, కొన్నిసార్లు పరుగు తీయకుండా సహకరించాడు. సిక్సర్‌తో సెంచరీ మార్కును చేరిన రాహుల్ భారత విజయాన్ని పూర్తి చేశాడు. రాహుల్, రాయుడు రెండో వికెట్‌కు అజేయంగా 162 పరుగులు జోడించడం విశేషం.
స్కోరు వివరాలు:-
జింబాబ్వే ఇన్నింగ్స్: పీటర్ మూర్ ఎల్బీడబ్ల్యు (బి) శరణ్ 3; చిబాబా (బి) బుమ్రా 13; మసకద్జ (సి) ధోని (బి) కులకర్ణి 14; ఎర్విన్ (సి) సబ్ ఫజల్ (బి) పటేల్ 21; సిబంద (సి) ధోని (బి) బుమ్రా 5; సికందర్ (బి) శరణ్ 23; చిగుంబురా (బి) బుమ్రా 41; ముతుంబామి (సి) రాహుల్ (బి) చహల్ 15; క్రీమర్ (బి) కులకర్ణి 8; చటారా (సి) రాయుడు (బి) బుమ్రా 4; ముజారాబాని (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (49. 5 ఓవర్లలో ఆలౌట్) 168. వికెట్ల పతనం: 1- 8; 2- 30; 3- 47; 4-69; 5-77; 6-115; 7- 140; 8- 156; 9- 167; 10- 168.
బౌలింగ్: కులకర్ణి 10-1-42-2; శరణ్ 10-0-42-2; బుమ్రా 9.5-2-28-4; పటేల్ 10-1-26-1; చహల్ 10-1-27-1.
భారత్ ఇన్నింగ్స్: రాహుల్ (నాటౌట్) 100; నాయర్ (సి) సికందర్ (బి) చటారా 7; రాయుడు (నాటౌట్) 62; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (42.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 173. వికెట్ల పతనం: 1-11.
బౌలింగ్: చటారా 7-1-20-1; ముజారాబాని 6-0-18-0; చిబాబా 8-1-14-0; క్రీమర్ 10-0-47-0; చిగుంబురా 4-0-34-0; సికందర్ 5-0-20-0; మసకద్జా 2.3-0-19-0.