
టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్
నాగపూర్: దక్షిణాఫ్రికాతో బుధవారమిక్కడ ప్రారంభమైన మూడో టెస్టులో టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. వరుణ్ అరోన్, స్టువర్ట్ బిన్నీ బదులు రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా జట్టులోకి వచ్చారు. దక్షిణాఫ్రికా జట్టులో ఒక మార్పు జరిగింది. కైలీ అబాట్ స్థానంలో సిమన్ హార్మర్ ను తీసుకున్నారు.
డేల్ స్టెయిన్ ఫిట్ లేనందువల్ల ఈ మ్యాచ్ లో ఆడడం లేదని దక్షిణాఫ్రికా కెప్టెన్ హషిమ్ ఆమ్లా తెలిపాడు. తర్వాతి మ్యాచ్ లో అతడు ఆడే అవకాశముందన్నాడు. టాస్ గెలిస్తే తాము కూడా ముందుగా బ్యాటింగ్ తీసుకోవాలనుకున్నామని వెల్లడించాడు. కోహ్లి సేనను తొందరగా అవుట్ చేయడమే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమని చెప్పాడు.
పిచ్ పొడిగా ఉందని, మొదటి రోజు బాగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నట్టు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి వివరించాడు. తొలి టెస్టులో భారత్ విజయం సాధించగా, బెంగళూరులో జరిగిన రెండో టెస్టు వర్షం కారణంగా రద్దయింది.