‘పసిడి’ రేసులో భారత జట్లు
ప్రపంచకప్ ఆర్చరీ
వ్రోక్లా (పోలండ్): వ్యక్తిగత విభాగాలలో అంతగా ఆకట్టుకోలేకపోయినా... టీమ్ ఈవెంట్స్‌లో భారత ఆర్చరీ జట్లు అలరించాయి. ప్రపంచకప్ స్టేజ్-4 టోర్నమెంట్‌లో పురుషుల, మహిళల జట్లు స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాయి. శుక్రవారం జరిగిన టీమ్ ఎలిమినేషన్ రౌండ్స్‌లో భారత జట్లు నిలకడగా రాణించాయి. అతాను దాస్, తరుణ్‌దీప్ రాయ్, జయంత తాలుక్‌దార్‌లతో కూడిన భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో 5-4 (55-57, 57-55, 53-54, 57-52; టైబ్రేక్ 29-27) స్కోరుతో చైనాను ఓడించింది. సెట్ గెలిచిన వారికి రెండు పాయింట్లు లభిస్తాయి.
నిర్ణీత నాలుగు రౌండ్‌ల తర్వాత రెండు జట్లు 4-4 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో ఫలితం తేలడానికి టైబ్రేక్‌ను నిర్వహించగా... భారత బృందం పైచేయి సాధించింది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికోతో టీమిండియా తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్‌లో భారత్ 5-1తో స్పెయిన్‌పై; క్వార్టర్ ఫైనల్లో 5-4తో నెదర్లాండ్స్‌పై నెగ్గింది.
మరోవైపు మహిళల విభాగంలో దీపిక కుమారి, లక్ష్మీరాణి, బొంబేలా దేవిలతో కూడిన భారత బృందం సెమీఫైనల్లో 6-2 (51-50, 56-48, 52-54, 54-53) స్కోరుతో జార్జియాపై గెలిచింది. ఆదివారం జరిగే ఫైనల్లో మెక్సికోతో భారత్ తలపడుతుంది. అంతకుముందు తొలి రౌండ్‌లో టీమిండియా 6-0తో పోలండ్‌పై; క్వార్టర్ ఫైనల్లో 5-4తో ఉక్రెయిన్‌పై గెలిచింది.