ఇంచియాన్:ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ లో మేరీ కోమ్ ఫైనల్ కు చేరగా, మరో ఇద్దరు బాక్సర్లు సెమీ ఫైనల్లో నిష్క్రమించారు. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో పూజా రాణి 0-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆమెకు కాంస్య పతకానికే పరిమితమైంది. ఇంచియాన్ లో జరుగుతున్న ఏషియాడ్ క్రీడల్లో ఆమె మహిళల 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన పోరులో చైనా క్రీడా కారిణి లీ కైన్ చేతిలో ఓటమి చెందింది. సెకెండ్ రౌండ్ లో ఆకట్టుకున్న పూజారాణి.. మూడో రౌండ్ కు వచ్చే సరికి చతికిలబడింది. రెండో రౌండ్ లో 27 పాయింట్లు సాధించిన పూజారాణి ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది.
అనంతరం మూడో రౌండ్ లో పదునైన పంచ్ లతో చెలరేగిన లీ కైన్.. జడ్జిల నుంచి అత్యధిక పాయింట్లు సాధించి పూజారాణికి చెక్ పెట్టింది. ఇదిలా ఉండగా నాల్గో రౌండ్ లో పూజారాణి పుంజుకుందామని ప్రయత్నాలను లీ అడ్డుకుని ఫైనల్ కు చేరుకుంది. అంతకుముందు మహిళల 48-51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో మేరీకోమ్ ఫైనల్ రౌండ్ కు చేరింది.వియాత్నం బాక్సర్ లి థాయ్ బాంగ్ పై మేరికోమ్ 3-0 తేడాతో గెలుపొందింది. ఫైనల్స్లో మేరీకోమ్ విజయం సాధిస్తే భారత్కు మరో పసిడి పతకం దక్కనుంది.అయితే సరితా దేవి కూడా సెమీ ఫైనల్లో ఓటమి చెందడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది.