'సర్'కి మేడం దొరికింది!
రాజ్‌కోట్: భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నిశ్చితార్థం... నగరానికే చెందిన రీవా సోలంకీతో శుక్రవారం జరిగింది. క్రికెటర్‌కు చెందిన రెస్టారెంట్ ‘జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్’లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ వేడుకను సింపుల్‌గా ముగించారు. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి నిరంజన్ షా, రాజ్ కోట్ సిటీ పోలీస్ కమిషనర్ మోహన్ జా వంటి ఎంపిక చేసిన కొంత మంది అతిథులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సౌరాష్ర్ట జట్టుకు ఆహ్వానం పంపినా రంజీ క్వార్టర్‌ఫైనల్స్ ఆడుతుండటంతో క్రికెటర్లెవ్వరూ ఈ వేడుకకు హాజరుకాలేదు.
రీవా రాకతో తనకు వ్యక్తిగతంగా, వృతిపరంగా అదృష్టం కలిసొస్తుందని జడేజా ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ ఏడాది ఆరంభం నుంచి నాకు మంచే జరిగింది. ఈ నిశ్చితార్థంతో రాబోయే పది నెలలు కూడా క్రికెట్‌లో మరింత విజయవంతమవుతానని ఆశిస్తున్నా. ఇప్పటికైతే షెడ్యూల్ బాగా బిజీగా ఉంది. కొంత సమయం తీసుకుని పెళ్లి కార్యక్రమం ముగించేస్తా’ అని జడేజా పేర్కొన్నాడు. టి20 వరల్డ్‌కప్‌లో రాణించడమే తన ముందున్న లక్ష్యమన్నాడు. తన కాబోయే శ్రీమతికి క్రికెట్ అంటే పెద్దగా ఇష్టముండదని చెప్పిన జడేజా, ఇప్పట్నించి మ్యాచ్‌లను చూస్తుందని తెలిపాడు.