చేజారిన కాంస్యం
బ్రిటన్ చేతిలో భారత్ ఓటమి హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీ
యాంట్‌వర్ప్ (బెల్జియం): రక్షణపంక్తి పేలవ ప్రదర్శన కారణంగా భారత పురుషుల హాకీ జట్టు మరో భారీ పరాజయం మూటగట్టుకుంది. ఆదివారం ముగిసిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో సర్దార్ సింగ్ బృందం నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. బ్రిటన్‌తో జరిగిన కాంస్య పతక పోరులో భారత్ 1-5 గోల్స్ తేడాతో ఓటమి చవిచూసింది. కాంస్య పతకం నెగ్గిన బ్రిటన్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.
సెమీస్‌లో ఆతిథ్య బెల్జియం చేతిలో 0-4తో ఓడిన భారత్... ఈ మ్యాచ్‌లోనూ నిరాశాజనక ఆటతీరును కనబరిచింది. భారత రక్షణపంక్తిలోని లోపాలను సద్వినియోగం చేసుకున్న బ్రిటన్ ఆటగాళ్లు బ్రాగ్‌డన్ (11వ ని.లో), గ్రిఫిత్ (27వ ని.లో), యాష్లే జాక్సన్ (37వ ని.లో), డిక్సన్ (42వ ని.లో), మిడిల్‌టన్ (44వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. భారత్‌కు రూపిందర్ పాల్ సింగ్ (59వ ని.లో) ఏకైక గోల్‌ను అందించాడు.