సైనా, శ్రీకాంత్‌లకు సవాల్
► డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి
► నేటి నుంచి ఇండియా ఓపెన్
న్యూఢిల్లీ: సొంతగడ్డపై గతేడాది ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ మరోసారి అదే ఫలితాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. మంగళవారం మొదలయ్యే ఈ మెగా టోర్నమెంట్‌లో ఈ ఇద్దరూ డిఫెండింగ్ చాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్నారు. తొలి రోజు కేవలం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లుంటాయి. బుధవారం నుంచి మెయిన్ ‘డ్రా’ మ్యాచ్‌లు మొదలవుతాయి. పురుషుల సింగిల్స్ విభాగంలో శ్రీకాంత్‌కు క్లిష్టమైన డ్రా పడింది. తొలి రౌండ్‌లో అతను ప్రపంచ ఏడో ర్యాంకర్ తియాన్ హువీ (చైనా)తో తలపడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1-5తో వెనుకంజలో ఉన్నాడు.
శ్రీకాంత్‌తోపాటు మెయిన్ ‘డ్రా’లో సాయిప్రణీత్, అజయ్ జయరామ్, ప్రణయ్ ఉన్నారు. క్వాలిఫయింగ్‌లో గురుసాయిదత్, సమీర్ వర్మ, ఆనంద్ పవార్ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. స్టార్ ఆటగాళ్లు లీ చోంగ్ వీ (మలేసియా), లిన్ డాన్ (చైనా), కెంటో మొమోటా (జపాన్), జార్గెన్‌సన్, విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) కూడా టైటిల్ రేసులో ఉన్నారు.
ఇక మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ సైనాకు కాస్త సులువైన ‘డ్రా’ ఎదురైంది. తొలి రౌండ్‌లో ఆమె క్వాలిఫయర్‌తో ఆడనుంది. సైనా ముందంజ వేస్తే క్వార్టర్స్‌లో ఐదో సీడ్ సుంగ్ జీ హ్యున్ (కొరియా), సెమీస్‌లో లీ జురుయ్ (చైనా) లేదా షిజియాన్ వాంగ్ (చైనా)లలో ఒకరితో ఆడాల్సి ఉంటుంది. మరోవైపు పీవీ సింధు తొలి రౌండ్‌లో జినైన్ కికాగ్ని (ఇటలీ)తో తలపడనుంది. ప్రపంచ నంబర్‌వన్, ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్‌తో సింధు ఆడాల్సి ఉన్నా మారిన్ చివరి నిమిషంలో వైదొలిగింది. దాంతో మారిన్ స్థానంలో కికాగ్నికి చోటు లభించింది.