రోసారియో(అర్జెంటీనా): ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్ షిప్ లో భారత జోడి జెమ్సన్ నింగ్ తోజమ్-అంకితా భకత్ లు పసిడి పతకాన్ని సాధించారు. మిక్స్ డ్ టీమ్ విభాగంలో ఈ జోడి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దాంతో మొత్తం మూడు పతకాలు భారత ఖాతాలో చేరాయి. అంతకుముందు రజత, కాంస్య పతకాలను భారత్ సాధించగా, ఆపై నింగ్ తోజమ్-అంకితా భకత్ ల ద్వయం పసిడిని సాధించడం విశేషం. తద్వారా 2009, 2011 యూత్ చాంపియన్ షిప్ లలో దీపికా కుమారి వరల్డ్ టైటిల్ ను సాధించిన తరువాత ఆ ఘనతను భారత్ అందుకోవడం ఇదే ప్రథమం.
పసిడి కోసం జరిగిన ఫైనల్లో భారత జోడి 6-2 తేడాతో రష్యా జోడిపై గెలిచి సత్తాచాటింది. అంతకుముందు పురుషుల ఈవెంట్ లో భాగంగా ఫైనల్లో నింగ్ తోజమ్ రన్నరప్ గా సరిపెట్టుకుని రజతకాన్ని సాధించాడు. దాంతో యూత్ చాంపియన్ షిప్ లో నింగ్ తోజమ్ సాధించిన పతకాలు రెండు కాగా, క్యాడెట్ మహిళల ఈవెంట్ ప్లే ఆఫ్ లో ఖుష్బే దయాల్, సంచితా తివారీలు కాంస్యాన్ని సాధించారు. ఇదిలా ఉంచితే, ఓవరాల్ గా వరల్డ్ ఆర్చరీ చాంపియన్ షిప్ లో భారత్ కు ఇది నాల్గో టైటిల్. గతంలో దీపికా కుమారి రెండు సార్లు విజేతగా నిలవగా, 2006లో పాల్టన్ హాన్సదా వరల్డ్ ఆర్చరీ టైటిల్ ను సాధించింది. కాంపౌడ్ జూనియర్ మహిళల ఈవెంట్ లో ఆమె స్వర్ణాన్ని సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment