వీడియో గేమ్‌తో విరాట్ సేన సంబరాలు..
గాలే: శ్రీలంక పర్యటనలో బోణి కొట్టిన విరాట్ సేన వినూత్నంగా విజయ సంబరాలు చేసుకుంటోంది. భారత్- శ్రీలంక టెస్టు సిరీస్‌లో భాగంగా గాలేలో జరిగిన తొలి టెస్టులో భారత్ 304 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఓపెనర్ శిఖర్ ధావన్, పుజరా అజయ సెంచరీలు.. రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ శతకం.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత్ అలవోకగా విజయం సాధించింది. రెండు సంవత్సరాల క్రితం ఇదే మైదానంలో ఓడిన భారత్ కు ప్రతీకారం తీరడంతో ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఫుట్‌బాల్ ఫిఫా వీడియో గేమ్‌లు ఆడుతూ పండుగ చేసుకున్నారు. దీన్ని రోహిత్ శర్మ సెల్ఫీతో సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ‘విజయాన్ని ఫిఫా వీడియో గేమ్‌తో ఆస్వాదిస్తున్నాము’ అని ట్వీట్ చేశాడు. రోహిత్ ఈ మ్యాచ్‌లో ఆడకపోయినప్పటికీ బాయ్స్ గొప్ప ప్రారంభం ఇచ్చారు అంటూ ప్రశంసించాడు. రాహుల్ తీసిన సెల్ఫీలో భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్, పుజార, వృద్ధిమాన్ సాహా,రాహుల్‌లు ఉన్నారు . రోహిత్ శ్రీలంక బోర్డర్ ప్రెసిడెంట్ ఎలెవన్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆడినప్పటికీ తుది జట్టులో స్థానం దక్కలేదు. రెగ్యులర్ ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్ జట్టులోకి వచ్చి రాణించాడు. ఇక భారత జట్టుపై మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహ్మద్ కైఫ్, యువరాజ్ సింగ్‌లు ప్రశంసల జల్లు కురిపించారు. రెండో టెస్టు ఆగస్టు 3 నుంచి కొలంబోలో ప్రారంభంకానుంది.