
భారత్‌కు కాంస్యం
కౌలాలంపూర్: ప్రపంచకప్ బెర్త్‌ను కోల్పోయిన భారత మహిళల హాకీ జట్టు... ఆసియా కప్‌లో కాంస్యంతో సంతృప్తిపడింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ పెనాల్టీ షూటౌట్‌లో 3-2 గోల్స్ తేడాతో చైనాపై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరుజట్ల స్కోరు 2-2తో సమం కావడంతో షూటౌట్‌ను నిర్వహించారు. తొలి అర్ధభాగంలో ఆధిపత్యం కనబర్చిన భారత్ రెండు ఫీల్డ్ గోల్స్ చేసి 2-0 ఆధిక్యంలో నిలిచింది. అనురాధా దేవి (16వ ని.), వందనా కత్రియా (31వ ని.) చెరో గోల్ చేశారు.
అయితే రెండో అర్ధభాగంలో పుంజుకున్న చైనా వ్యూహాత్మకంగా ఆడింది. యాన్ యాన్ (51వ ని.), వు మెంగ్రాంగ్ (64వ ని.)లు చెరో గోల్ చేసి స్కోరును సమం చేశారు. షూటౌట్‌లో భారత క్రీడాకారిణులు మూడు అవకాశాలను సద్వినియోగం చేసుకోగా.. చైనీయులు రెండింటితోనే సరిపెట్టుకున్నారు. మరోవైపు ఫైనల్లో సంచలన ఆటతీరుతో చెలరేగిన జపాన్ 2-1తో డిఫెండింగ్ చాంపియన్ కొరియాపై నెగ్గి టైటిల్‌ను సొంతం చేసుకుంది.