మళ్లీ ఓడారు... | indian womens cricket loss the game against ausis | Sakshi
Sakshi News home page

మళ్లీ ఓడారు...

Published Thu, Jul 13 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 3:52 PM

మళ్లీ ఓడారు...

మళ్లీ ఓడారు...

ఆసీస్‌ చేతిలో భారత్‌ పరాజయం
పూనమ్‌ రౌత్‌ సెంచరీ వృథా
రాణించిన మిథాలీ రాజ్‌
కివీస్‌ మ్యాచ్‌పైనే భారత్‌ సెమీస్‌ ఆశలు


దక్షిణాఫ్రికా చేతిలో భంగపడిన భారత్‌... తాజాగా ఆస్ట్రేలియా చేతిలోనూ దారుణ పరాజయం చవిచూసింది. భారత ఓపెనర్‌ పూనమ్‌ రౌత్‌ సెంచరీతో అదరగొట్టినా... మిథాలీ రాజ్‌ వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించినా... తుది ఫలితం మాత్రం భారత్‌ను నిరాశపరిచింది. ఈ ఓటమితో మిథాలీ సేనకు సెమీస్‌ బెర్త్‌  క్లిష్టమైంది. న్యూజిలాండ్‌తో ఈనెల 15న జరిగే చివరి లీగ్‌ మ్యాచ్‌ ఫలితంపైనే టీమిండియా సెమీఫైనల్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు సెమీస్‌ స్థానం ఖాయమవుతుంది. ఒకవేళ వర్షం వల్ల రద్దయితే మాత్రమే భారత్‌ సెమీస్‌కు చేరుకుంటుంది.   

బ్రిస్టల్‌: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో మిథాలీ సేనకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో భారత్‌పై జయభేరి మోగించి సెమీఫైనల్‌కు చేరింది. మొదట భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. పూనమ్‌ రౌత్‌ (136 బంతుల్లో 106; 11 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (114 బంతుల్లో 69; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించింది. తర్వాత ఆస్ట్రేలియా 45.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసి గెలిచింది. మెగ్‌ లానింగ్‌ (88 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో గెలిపించింది. ఎలీస్‌ పెర్రీ (67 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు) కూడా బాధ్యతాయుతంగా ఆడింది.

ఆడింది ఇద్దరే...
బ్యాటింగ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌ చేతులెత్తేశారు. ఓపెనర్‌ పూనమ్‌ రౌత్, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ మినహా ఇంకెవరూ బాధ్యత తీసుకోలేదు.  తొలి రెండు మ్యాచ్‌ల్లో అసాధారణ ఆటతీరు కనబరిచిన స్మృతి మంధన (3) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. 9 పరుగులకే వికెట్‌ కోల్పోయిన భారత ఇన్నింగ్స్‌ను పూనమ్, మిథాలీ చక్కదిద్దారు. మరో వికెట్‌ కోల్పోకుండా జట్టు స్కోరును 100 పరుగులకు చేర్చారు. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. జట్టు స్కోరు 166 పరుగుల వద్ద మిథాలీ... బీమ్స్‌కే రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించింది. సెంచరీ పూర్తయ్యాక పూనమ్‌ రౌత్‌ ఔట్‌ కాగా... ఆ తర్వాత వచ్చిన వారిలో హర్మన్‌ప్రీత్‌ (23) రెండంకెల స్కోరు చేసింది. వేద (0), సుష్మ (6), జులన్‌ గోస్వామి (2) నిరాశపరిచారు.
గెలిపించిన లానింగ్, పెర్రీ
కష్టసాధ్యం కాని 227 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్‌ అలవోకగా ఛేదించింది. ఓపెనర్లు బోల్టన్‌ (36), మూని (45) తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించి శుభారంభం ఇవ్వగా... తర్వాత కెప్టెన్‌ లానింగ్, పెర్రీ మరో వికెట్‌ పడకుండా జట్టును నడిపించారు. పేలవమైన భారత బౌలింగ్‌పై ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. మూడో వికెట్‌కు అజేయంగా 124 పరుగులు జోడించారు.

సెమీస్‌లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా
ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లూ సెమీస్‌ చేరాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా జట్టు (104/2)) 8 వికెట్ల తేడాతో శ్రీలంక (101 ఆలౌట్‌)పై గెలుపొందగా... ఇంగ్లండ్‌ (284/9) 75 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ (209 ఆలౌట్‌)పై విజయం సాధించింది. ఆరో రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లు పూర్తయ్యాక ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఖాతాలో 10 పాయింట్లు... దక్షిణాఫ్రికా ఖాతాలో 9 పాయింట్లు ఉన్నాయి. భారత్‌ ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో, న్యూజిలాండ్‌ ఏడు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement