'భారత్ పై మ్యాచ్ ఓడిపోవడానికి కారణం అదే'
కోల్ కతా: భారత్ తో జరిగిన రెండో టెస్టులో ఘోర ఓటమి పాలైన న్యూజిలాండ్ ఇప్పుడు అందుకు కారణాలు వెతికే పనిలో పడింది. ప్రత్యేకంగా కోల్ కతాలో ఈడెన్ లో భారత్ విసిరిన లక్ష్యం ఒక సవాల్ అయితే, తొలి ఇన్నింగ్స్ లో 100 పరుగులకు పైగా వెనుకబడిపోవడం మరొక కారణమని న్యూజిలాండ్ యాక్టింగ్ కెప్టెన్ రాస్ టేలర్ స్పష్టం చేశాడు.
'ఎక్కడైనా చూసుకోండి. తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్ధి జట్టు కంటే వంద పరుగులు వెనుకబడితే తేరుకోవడం కష్టం. రెండో ఇన్నింగ్స్ లో భారత్ ను ఆరంభంలో కట్టడి చేశాం. అప్పటికే భారత్ 150 పరుగుల పైగా ఆధిక్యం సాధించింది. దాంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది. ఈ పిచ్ పై భారీ పరుగుల్ని ఛేదించడం అంత సులువు కాదు. కనీసం 40 పరుగులకు మూడు భారత వికెట్లను తీసి ఉంటే వారి ఆధిక్యం ఇంత ఉండేది కాదు. ఒకసారి వెనుకబడి, ఆ తరువాత భారీ లక్ష్యాన్ని ఛేదించాలంటే ఒక సవాల్. మేము అన్ని సెషన్లు బాగా ఆడాం. మ్యాచ్ ముగిసిన రోజు మాకంటే మెరుగైన ప్రదర్శన చేసిన వారి చేతిలో ఓడాం' అని టేలర్ తెలిపాడు. ప్రత్యేకంగా వృద్ధిమాన్ సాహా రెండు ఇన్నింగ్స్ ల్లో నమోదు చేసిన అజేయ హాఫ్ సెంచరీలే తమను వెనుక్కు నెట్టాయన్నాడు. దాంతో భారత్ తమపై పైచేయి సాధించిందన్నాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ సాధించిన ఆధిక్యమే తమ ఓటమికి ప్రధాన కారణమని టేలర్ పేర్కొన్నాడు.