శుభ్‌మాన్ గిల్ అజేయ శతకం
మూడో వన్డేలో భారత్ విజయం
ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో సిరీస్
ముంబై: ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ (157 బంతుల్లో 138 నాటౌట్; 17 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ సాధించడంతో... ఇంగ్లండ్ అండర్–19 జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైంది. భారత లెగ్ స్పిన్నర్ రాహుల్ చహల్ (4/33), లెఫ్టార్మ్ స్పిన్నర్ అనుకూల్ రాయ్ (3/39) ఇంగ్లండ్‌ను దెబ్బతీశారు. ఇంగ్లండ్ తరఫున రాలిన్స్ (96; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిలో సెంచరీని చేజార్చుకోగా... బార్ట్‌లెట్ (55; 6 ఫోర్లు, ఒక సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు.
వీరిద్దరూ మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. రాహుల్ చహల్ బౌలింగ్‌లో బార్ట్‌లెట్ అవుటయ్యాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ తడబడింది. 216 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. 101 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన దశలో వికెట్ కీపర్ హార్విక్ దేశాయ్ (50 బంతుల్లో 37 నాటౌట్)తో కలిసి శుభ్‌మాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో వికెట్‌కు అజేయంగా 115 పరుగులు జోడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. సిరీస్‌లో నాలుగో వన్డే ఇదే వేదికపై సోమవారం జరుగుతుంది.