
బింద్రా పసిడి గురి
వ్యక్తిగత, టీమ్ ఈవెంట్‌లో స్వర్ణాలు
ఆసియా చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: భారత స్టార్ షూటర్ అభినవ్ బింద్రా సొంతగడ్డపై పక్కా గురితో పసిడి పతకాలు సాధించాడు. ఆసియా ఎయిర్ గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు సీనియర్ విభాగంలో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో 2008 బీజింగ్ ఒలింపిక్స్ చాంపియన్ అభినవ్ బింద్రా 208.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. యుర్కోవ్ యురీ (కజకిస్తాన్-206.6 పాయింట్లు) రజతం, యు జెచుల్ (కొరియా-185.3 పాయింట్లు) కాంస్య పతకం నెగ్గారు. భారత్‌కే చెందిన గగన్ నారంగ్ 164.5 పాయింట్లతో నాలుగో స్థానంలో, చెయిన్ సింగ్ 122.7 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. అభినవ్ బింద్రా, గగన్ నారంగ్, చెయిన్ సింగ్‌లతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించింది.
క్వాలిఫయింగ్‌లో బింద్రా, గగన్, చెయిన్ సింగ్‌లు కలిసి మొత్తం 1868.6 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచారు. కొరియా జట్టుకు రజతం, సౌదీ అరేబియా జట్టుకు కాంస్యం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ యూత్ విభాగంలో సత్యజీత్ (204.8 పాయింట్లు) భారత్‌కు స్వర్ణాన్ని అందించగా... సత్యజీత్, మిథిలేశ్, గజేంద్ర రాజ్‌లతో కూడిన భారత జట్టుకు టీమ్ విభాగంలో రజతం దక్కింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ జూనియర్ విభాగంలో ప్రతీక్ (203.9 పాయింట్లు) రజతం సంపాదించగా... ప్రతీక్, ప్రశాంత్, అఖిల్‌లతో కూడిన భారత జట్టుకు టీమ్ విభాగంలో రజతమే లభించింది.