ఆంధ్రకు ఇన్నింగ్స్ విజయం
త్రిపురతో రంజీ మ్యాచ్
సాక్షి, ఒంగోలు: మీడియం పేసర్ దువ్వారపు శివ కుమార్ కెరీర్‌లోనే ఉత్తమ గణాంకాల (మ్యాచ్‌లో 11 వికెట్లు)ను నమోదు చేయడంతో... త్రిపురతో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. గురువారం మూడో రోజు జరిగిన ఆటలో త్రిపుర జట్టు తమ రెండో ఇన్నింగ్స్‌లో శివకుమార్ (4/54) ధాటికి 58.1 ఓవర్లలో 151 పరుగులకే కుప్పకూలింది.
నిరుపమ్ సేన్ చౌధరి (42) మాత్రమే రాణిం చాడు. స్టీఫెన్‌కు మూడు, విజయ్‌కుమార్‌కు రెండు వికెట్లు దక్కాయి. శుక్రవారం 13/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన త్రిపుర... ఓ దశలో 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మన్ నిరుపమ్ పోరాటంతో వంద పరుగులైనా దాటగలిగింది.
హైదరాబాద్‌కు ఇన్నింగ్స్ ఓటమి
అస్సాంతో రంజీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: సొంత గడ్డపై హైదరాబాద్ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. ఫలితం తేలే అవకాశాలు లేవనుకున్న మ్యాచ్‌ను స్పిన్నర్ స్వరూపం పుర్కయస్తా (మ్యాచ్‌లో 13 వికెట్లు) అద్భుత బౌలింగ్‌తో పూర్తిగా మార్చేశాడు. రెండు రోజుల పాటు పిచ్ మరీ నెమ్మదించినా చివరి రెండు రోజులు (గురు, శుక్ర) బంతి అనూహ్యంగా టర్న్ అయ్యింది. దీంతో ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ 56 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది.
గురువారం మూడో రోజు 35 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన హైదరాబాద్‌ను స్వరూపం (5/59) చావుదెబ్బ తీయడంతో 100.1 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ తన్మయ్ (205 బంతుల్లో 68; 7 ఫోర్లు), అహ్మద్ ఖాద్రి (98 బంతుల్లో 50; 5 ఫోర్లు), అక్షత్ (115 బంతుల్లో 41; 4 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే రాణిం చారు. జమాలుద్దీన్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం 178 పరుగులు వెనుకబడి ఫాలోఆన్ ఆడిన హైదరాబాద్... తమ రెండో ఇన్నింగ్స్‌లో 66.3 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌటయింది. స్వరూపం (29-16-29-8)ఏకంగా 8 వికెట్లు తీశాడు.