‘ఫ్రెండ్లీ’లో భారత్‌దే పైచేయి
ఫోమ్ పెన్హ్ (కంబోడియా): అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు 3–2తో కంబోడియాపై విజయం సాధించింది. విదేశీ గడ్డపై 11 ఏళ్ల తర్వాత భారత్ సాధించిన తొలి విజయమిది. ‘ఫిఫా’ ర్యాంకింగ్స్‌లో 132వ ర్యాంకులో ఉన్న భారత్... తనకన్నా 41 స్థానాలు దిగువన ఉన్న కంబోడియాపై గెలిచి ఏఎఫ్‌సీ ఆసియా కప్ క్వాలిఫయర్స్‌కు ముందు కావాల్సిన ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సునీల్ ఛెత్రి (35వ ని.), జెజె లాల్‌పెక్లువా (49వ ని.), సందేశ్ జింగాన్ (52వ ని.) తలా ఒక గోల్ చేశారు. కంబోడియా తరఫున కోన్ లెబోరవి (36వ ని.), చన్ వతనక (62వ ని.)చెరో గోల్ సాధించారు. ఏఎఫ్‌సీ క్వాలిఫయర్స్‌లో భాగంగా తొలి అంచె పోటీల్లో భారత్ ఈ నెల 28న మయన్మార్‌తో తలపడుతుంది. యాన్‌గాన్ (మయన్మార్)లో ఈ మ్యాచ్ జరుగుతుంది.