ఈసారీ స్టార్లే | international players joins Indian Super League in upcomming session | Sakshi
Sakshi News home page

ఈసారీ స్టార్లే

Published Wed, Aug 5 2015 11:15 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

ఈసారీ స్టార్లే - Sakshi

ఈసారీ స్టార్లే

ఐఎస్‌ఎల్‌లో ఆరు జట్లకు కొత్త మార్క్యూ ప్లేయర్లు
- ఢిల్లీతో చేరిన రాబర్టో కార్లోస్


ఇండియన్ సూపర్ లీగ్ తొలి సీజన్ సూపర్ హిట్ అవడంతో రెండో సీజన్‌పై అంచనాలు పెరిగాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరిసిన సూపర్ స్టార్లను తీసుకురావడం 2014లో జరిగిన తొలి సీజన్ హిట్ కావడానికి తోడ్పడింది. ఈ ఏడాది కూడా ఐఎస్‌ఎల్‌లోని జట్లు మరికొంత మంది సూపర్‌స్టార్లను భారత్‌కు తీసుకురాబోతున్నాయి. జట్లన్నీ తమ మార్క్యూ  ప్లేయర్లని ప్రకటించడానికి జూలై 31 అఖరి తేదీ కావడంతో వారి జాబితాను విడుదల చేశాయి. గతేడాది ఆడిన వారిలో చెన్నైయాన్, ముంబై జట్లు మినహా మిగతా జట్లన్నీ కొత్త ఆటగాళ్లను మార్క్యూ ప్లేయర్లుగా ప్రకటించాయి. ఈ సారి ఢిల్లీ డైనమోస్ జట్టు బ్రెజిల్ దిగ్గజం రాబర్టో కార్లోస్‌ను భారత్‌కు తీసుకురావడం విశేషం. కోల్‌కతా జట్టు చెల్సి దిగ్గజం దిదియర్ ద్రోగ్బా కోసం ప్రయత్నించినా చివరికి పోర్చుగల్ ఆటగాడు పొస్టిగా సరిపెట్టుకుంది. జట్లు, వారి మార్క్యూ ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే..

రాబర్టో కార్లోస్.. (ఢిల్లీ డైనమోస్)
 వయసు: 42, దేశం: బ్రెజిల్
 ఆడే స్థానం: డిఫెండర్
 గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): ఇంటర్ మిలాన్, రియల్ మాడ్రిడ్, ఫెనర్‌బాచే
 అంతర్జాతీయంగా అభిమానులు సంపాదించుకున్న దిగ్గజం. భారత్‌కు రావడం మన దేశ ఫుట్‌బాల్‌కు శుభపరిణామం. ఫ్రికిక్‌లకు పెట్టింది పేరు. మూడు ఫిఫా ప్రపంచకప్‌ల్లో ఆడాడు. 2002 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. రియల్ మాడ్రిడ్ తరఫున నెగ్గని కప్ లేదు. తొలిసారిగా ఐఎస్‌ఎల్‌లో ఆడబోతున్న కార్లోస్‌పైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. అయితే 42 ఏళ్ల కార్లోస్.. కోచింగ్‌కే ఎక్కువగా పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
 
 ఎలనో బ్లూమర్ (చెన్నైయాన్ ఎఫ్‌సీ)
 వయసు: 34, దేశం: బ్రెజిల్
 ఆడే స్థానం: మిడ్ ఫీల్డర్
 గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): సాంటోస్, మాంచెస్టర్ సిటీ, గలటాసరి
 గతేడాది ఐఎస్‌ఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాడు. గాయం కారణంగా సీజన్ మొత్తం ఆడకపోయినా 11 మ్యాచ్‌ల్లో 8 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సాంటోస్ జట్టుతో ఒప్పందం ఉన్నా లోన్‌లో చెన్నైయాన్‌కు వచ్చాడు. బ్రెజిల్ తరఫున 50 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది అభిమానులందరూ భారీ అంచనాలు పెట్టుకున్నది ఇతనిపైనే.
 
 నికోలస్ అనెల్కా (ముంబై సిటీ ఎఫ్‌సీ)
 వయసు: 36, దేశం: ఫ్రాన్స్
 ఆడే స్థానం: ఫార్వర్డ్
 గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): అర్సెనల్, లివర్‌పూల్, మాంచెస్టర్ సిటీ, చెల్సి
 తొలిసీజన్‌లోనే ముంబై జట్టుకు ఆడినా గాయం కారణంగా చాలా ఆలస్యంగా బరిలోకి దిగాడు. ఈ సారి కోచింగ్ బాధ్యతలు కూడా తీసుకున్నాడు. లీగ్‌లో అత్యంత క్రేజ్ ఉన్న ఆటగాడు. ప్రఖ్యాత ఇంగ్లిష్ ప్రిమీయర్ లీగ్‌లో టాప్ క్లబ్‌ల తరఫున ఆడాడు. అంతర్జాతీయ కెరీర్ అంత ఆశాజనకంగా లేకపోయినా లీగ్ దశలో మాత్రం ప్రఖ్యాత క్లబ్‌కే ప్రాతినిథ్యం వహించాడు. అనెల్కా వంటి ఆటగాడు ఉంటే జట్టుకు అతడే సగం బలం.
 
 లూసియో.. (ఎఫ్‌సీ గోవా)
 వయసు: 37, దేశం: బ్రెజిల్
 ఆడే స్థానం: డిఫెండర్
 గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): బెయర్ లెవర్‌కుసెన్, బెయర్న్ మ్యునిచ్, ఇంటర్ మిలాన్
 2002 ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. వందుకు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. తొలిసారి ఇండియాలో ఆడబోతున్నాడు. బెయర్ లెవర్‌కుసెన్, బెయర్న్ మ్యునిచ్ తరఫున అద్భుత ప్రదర్శన చేశాడు. ఇంటర్ మిలాన్‌లో ఆడుతున్నప్పుడు ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ టైటిల్ నెగ్గాడు. ‘ఆల్ టైమ్ గ్రేట్’ జికో కోచ్‌గా వ్యవహరిస్తుండడం, ఇప్పుడు లూసియో కూడా రావడంతో జట్టుపై అంచనాలు పెరిగాయి.
 
 అడ్రియన్ ముతు.. (పుణే ఎఫ్‌సీ)
 వయసు: 36, దేశం: రొమెనియా
 ఆడే స్థానం: ఫార్వర్డ్
 గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): చెల్సి, జువెంటాస్, ఫియోరెంటినా
 కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. 2004లో చెల్సి తరఫున ఆడుతూ డ్రగ్ పరీక్షలో విఫలమవ డంతో ఏడు నెలలు ఫుట్‌బాల్ నుంచి నిషేధం ఎదుర్కొన్నాడు. తాగి అసభ్యంగా ప్రవర్తించడం, జాతీయ జట్టు మేనేజర్ ఫొటోను కమెడియన్‌లా మార్ఫ్ చేయడంతో జాతీయ జట్టు నుంచి 2013లో ఉద్వాసనకు గురయ్యాడు. ఐఎస్‌ఎల్‌లో ఇదే తొలి సీజన్. ప్రస్తుతానికైతే ఇంకా భారత్ వీసా రాలేదు.  ఇండియన్ ఎంబసీకి వెళ్లినప్పుడు ముతు తాగి ఉన్నట్లు గుర్తించిన అధికారులు వీసా మంజూరు చేయలేదు.
 
 కార్లోస్ మార్చెనా లోపెజ్.. (కేరళ బ్లాస్టర్స్)
 వయసు: 36,
 దేశం: స్పెయిన్
 ఆడే స్థానం: మిడ్ ఫీల్డర్
 గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): సెవిల్లా, బెన్ఫికా, వాలెన్సియా, విల్లారియల్
 స్పెయిన్ జట్టులో 2002 నుంచి రిటైరయ్యే వరకు రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగాడు. 2010 ఫిఫా ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడు. 2008 యూరోపియన్ చాంపియన్‌షిప్ కూడా నెగ్గాడు. భారత్‌కు తొలిసారి రాబోతున్నాడు. ఎక్కువగా మిడ్ ఫీల్డర్ స్థానంలో ఆడినా, డిఫెన్స్‌లో కూడా ఆడగల సత్తా ఉన్న ఆటగాడు.
 
 సిమావో సబ్రోసా.. (నార్త్‌ఈస్ట్ యునెటైడ్)
 వయసు: 35,
 దేశం: పోర్చుగల్
 గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): అథ్లెటికో మాడ్రిడ్, బార్సిలోనా, బెన్ఫికా
 పోర్చుగల్ తరఫున 85 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 22 గోల్స్ సాధించాడు. రెండు ప్రపంచకప్‌లతో పాటు మూడు యూరోపియన్ కప్‌ల్లో ఆడాడు. తొలిసారిగా భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించబోతున్నాడు. అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా ఆడే సిమావో గోల్స్ చేయడంలో కూడా దిట్ట.
 
 హెల్డర్ పొస్టిగా..(అథ్లెటికో డి కోల్‌కతా)
 వయసు: 32, దేశం: పోర్చుగల్
 ఆడే స్థానం: ఫార్వర్డ్
 గతంలో ఆడిన జట్లు (ముఖ్యమైనవి): పొర్టో, టొటెన్హమ్, వాలెన్సియా,
  డెపొర్టివో.
 తొలిసారి ఐఎస్‌ఎల్‌లో ఆడనున్నాడు. రెండు సార్లు ఫిఫా ప్రపంచకప్‌ల్లో ఆడాడు. పోర్చుగల్ తరఫున  71 మ్యాచ్‌లు ఆడి 27 గోల్స్ సాధించాడు. అలాగే 2004, 2008, 2012ల్లో యూరోపియన్ చాంపియన్‌షిప్ టోర్నీల్లో పాల్గొన్నాడు. ఈ ఏడాది ఉన్న మార్క్యూ ఆటగాళ్లలో తక్కువ వయసు ఆటగాడు. గతేడాది చాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా తరఫున ఆడతుండడంతో ఇతనిపై అంచనాలతో పాటు ఒత్తిడి గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement