కోచ్ గా మారనున్న పాక్ మాజీ బ్యాట్స్ మన్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్- హక్ కోచ్ అవతారం ఎత్తనున్నాడు. అఫ్గానిస్థాన్ క్రికెట్ టీమ్ కోచ్ గా అతడు ఎంపికయ్యాడు. రెండేళ్ల పాటు అతడీ పదవిలో కొనసాగనున్నాడు.
ఈమేరకు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇంజమామ్ అంగీకరించాడని అఫ్గానిస్థాన్ మాజీ కోచ్, పాకిస్థాన్ క్రికెట్ సెలెక్టర్ కబీర్ ఖాన్ తెలిపారు. జింబాబ్వేతో మ్యాచ్ గెలిచాక అఫ్గానిస్థాన్ ప్రదర్శనపై ఇంజమామ్ సంతృప్తి వ్యక్తం చేశాడని, కోచ్ కు ఉండేందుకు ఒప్పుకున్నాడని చెప్పాడు. ఇంజమామ్ గొప్ప ఆటగాడని, అతడి నేతృత్వంలో అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు ప్రమాణాలు మెరుగవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
పాకిస్థాన్ తరపున ఇంజమామ్ వుల్-హక్ 120 టెస్టులు, 388 వన్డేలు ఆడాడు. పాకిస్థాన్ టీమ్ కు కోచ్ గా రెండేళ్ల క్రితం అతడికి అవకాశం వచ్చింది. అయితే పాక్ క్రికెట్ బోర్డుతో ఆర్థిక వివాదాల కారణంగా ఆ అవకాశాన్ని అతడు తిరస్కరించాడు.