'సీమ్ పిచ్ లు సిద్ధం చేయండి'
కరాచీ: వచ్చే నెలలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న నేపథ్యంలో ముందుగా తమ క్రికెటర్లకు సీమ్ పిచ్ లపై అవగాహన పెంచే పనిలో పడ్డాడు చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్. ఈ మేరకు పాక్ ఆటగాళ్లకు ఇంగ్లండ్ పరిస్థితులు, పిచ్ లపై ఎలా ఆడాలనే దానిపై అనుభవం రావడానికి శిక్షణా శిబిరంలో సీమ్ పిచ్ లు సిద్ధం చేయాలని క్యూరేటర్లను కోరాడు. పాక్ జాతీయ జట్టు సన్నాహక మ్యాచ్ ల్లో కచ్చితంగా సీమ్ పిచ్ లు ఉండాల్సిందేనని హక్ సూచించాడు.
ఇంగ్లండ్ వాతావారణానికి అలవాటు పడేందుకు పాక్ జట్టును రెండు వారాల ముందే ఇంగ్లండ్ పంపాలని పీసీబీ తీసుకున్న నిర్ణయాన్ని హక్ సమర్ధించాడు. ఈ సందర్భంగా స్వదేశంలో ఇంగ్లండ్ జట్టు సాధించిన టెస్టు ఫలితాలను ఇంజమామ్ పరిశీలించాడు. ప్రత్యేకంగా 2014లో ఇంగ్లండ్ జట్టు 3-1తేడాతో భారత్ జట్టును ఓడించిన విధానాన్ని ఈ మాజీ ఆటగాడు అధ్యయనం చేశాడు. దీనిలో భాగంగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే పాక్ క్రికెటర్లు సీమ్ పిచ్ లపై అవగాహన ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాడు.