సిరాజ్‌ బన్‌గయా కరోడ్‌పతి | ipl 10 : Sunrisers hyd buying Bowler Mohammad Siraj | Sakshi
Sakshi News home page

సిరాజ్‌ బన్‌గయా కరోడ్‌పతి

Published Tue, Feb 21 2017 12:31 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

తల్లిదండ్రులు, సోదరుడితో ఆనందం పంచుకుంటూ..

తల్లిదండ్రులు, సోదరుడితో ఆనందం పంచుకుంటూ..

వేలంలో రూ. 2.6 కోట్లకు సొంతం చేసుకున్న సన్‌రైజర్స్‌   

హైదరాబాద్‌: ‘మా అమ్మా నాన్న కోసం ఇప్పుడు ఒక మంచి ఇల్లు కొంటాను. వేలంలో భారీ విలువ పలికాక నా మనసులో వచ్చిన ఆలోచన అదొక్కటే’... హైదరాబాద్‌ ఫాస్ట్‌ బౌలర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ మనసులో మాట ఇది. మాసాబ్‌ట్యాంక్‌ సమీపంలోని ఖాజానగర్‌లో ఉన్న ఒక ఇరుకైన అద్దె ఇల్లు సోమవారం ఒక్కసారిగా జనసంద్రంతో నిండిపోయింది. లెక్క లేనంత సంఖ్యలో ఉన్న సిరాజ్‌ మిత్రులు, పాత బంధువులు, కొత్తగా పరిచయం చేసుకున్న మరికొందరితో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆటో డ్రైవర్‌ గౌస్‌ కొడుకైన సిరాజ్‌ కేవలం స్వయంకృషి, పట్టుదలతో సాధించిన పేరు అది. రాజకీయాలు, సిఫారసులకు అడ్డా అయిన హైదరాబాద్‌ క్రికెట్‌లో కేవలం ప్రతిభపైనే ఈ 22 ఏళ్ల పేసర్‌ దూసుకొచ్చాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో భారీ మొత్తంతో దేశం దృష్టినీ అతను ఆకర్షించాడు.

స్నేహితుల మధ్య టెన్నిస్‌ బాల్‌తో గల్లీ క్రికెట్‌లోనే ప్రపంచం... పెద్దోడు ఇంజినీరింగ్‌ చదివాడు, నువ్వు ఎప్పుడు బాగుపడతావురా? అని తల్లి షబానా ఆందోళన... ఆటో డ్రైవర్‌గా సంపాదన సరిపోవడం లేదని తండ్రి అంటే చివరకు కొంతయినా భారం తగ్గిద్దామని ఇళ్లకు పెయింట్‌ వేసే పని కూడా చేశాడు... కానీ సిరాజ్‌ ఎప్పుడూ కష్టపడేందుకు వెనుకాడలేదు. తాను ఇష్టపడిన బౌలింగ్‌లోనే తల్లిదండ్రులు గర్వపడేలా చేశాడు. ఇకపై గౌస్‌కు మళ్లీ ఆటో నడిపించాల్సిన అవసరం లేదు.

ఎక్కడా ప్రాథమిక అంశాలు నేర్చుకోకుండా 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్‌ చేస్తున్న సిరాజ్‌లోని సహజ ప్రతిభను అద్నాన్‌ అనే కోచ్‌ గుర్తించాడు. ఆయన మార్గనిర్దేశనంలో లీగ్‌ స్థాయి క్రికెట్‌ ఆడటం, అక్కడ 59 వికెట్లతో హెచ్‌సీఏ సెలక్టర్ల దృష్టిలో పడటం చకచకా జరిగిపోయాయి.  హైదరాబాద్‌ అండర్‌–23 జట్టు తరఫున 29 వికెట్లు పడగొట్టడంతో వెంటనే రంజీల్లో చోటు దక్కింది. గత ఏడాది ఒక మ్యాచ్‌కే పరిమితమైనా ఈ సీజన్‌లో 41 వికెట్లతో దేశంలోనే మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఇరానీ కప్, ఇండియా ‘ఎ’ టీమ్‌లోకి ఎంపిక కావడంలో ఎలాంటి అడ్డంకీ రాలేదు. ఇప్పుడు ఐపీఎల్‌ కాంట్రాక్ట్‌తో ఈ హైదరాబాద్‌ కుర్రాడు మరో మెట్టు ఎక్కాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement