
లక్ష్యం... వరల్డ్ కప్!
ఐపీఎల్‌లో బాగా ఆడటమే మార్గం
సన్‌రైజర్స్ సమతూకంగా ఉంది
క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: భారత జట్టులో పునరాగమనం చేసి 2015లో జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడటమే తన లక్ష్యమని ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. అందుకు ఈ ఏడాది జరిగే ఐపీఎల్-7ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటానని అతను అన్నాడు. భారత్ తరఫున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టి20 మ్యాచ్‌లు ఆడిన ఇర్ఫాన్... ఆఖరిసారిగా 2012 టి20 ప్రపంచ కప్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
ఈ ఐపీఎల్‌లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాడిగా బరిలోకి దిగనున్నాడు. ‘2015 ప్రపంచ కప్ ఆడటమే నా లక్ష్యం. అయితే అంతకుముందు చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. ముందుగా భారత జట్టులో చోటు సంపాదించేందుకు ప్రయత్నిస్తాను. ఐపీఎల్ టోర్నీలో సన్‌రైజర్స్ జట్టు మరీ లోయర్ ఆర్డర్‌లో కాకుండా కాస్త ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం కల్పిస్తోందని ఆశిస్తున్నా’ అని ఇర్ఫాన్ చెప్పాడు.
తన శరీర స్థాయిని మించి చేసిన అదనపు శ్రమతో తరచుగా గాయాల పాలయ్యానని, అయితే ఎన్‌సీఏలో ప్రత్యేక శిక్షణ అనంతరం ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ఇర్ఫాన్ పఠాన్ వెల్లడించాడు. బౌలింగ్‌లో వేగంకంటే స్వింగ్‌కే తన ప్రాధాన్యత అని అతను చెప్పాడు. ‘145 కిమీ.కు పైగా వేగం చేయాలని ప్రయత్నించి లయ తప్పడం నాకిష్టం లేదు. వేగంకంటే బంతిని స్వింగ్ చేయగలగడం నా సహజ నైపుణ్యంగా భావిస్తా. అందుకే దానితోనే మంచి ఫలితాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తా’ అని ఈ బరోడా ఆటగాడు తెలిపాడు. సమతూకంతో ఉన్న సన్‌రైజర్స్ జట్టుకు ఈసారి ఐపీఎల్‌లో విజయావకాశాలు ఉన్నాయని ఇర్ఫాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు.