హైదరాబాద్: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసిన తర్వాత బౌలర్లు వివిధ రకాల హావభావాలతో సంబరాలు చేసుకుంటారు. అలా సంబరాలు భిన్నంగా చేసుకునే వారిలో దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహీర్ మొదటి స్థానంలో ఉంటాడు. తాజాగా మరో ఆటగాడు చేసుకున్న సంబరాలు ఆశ్చర్యంతో పాటు ఆలోచనలో పడేశాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేసర్ ఖలీల్ అహ్మద్ ‘ఫోన్ కాల్ సెలెబ్రేషన్స్’ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం రాత్రి విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
అనంతరం 163 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఓపెనర్లు ధావన్, పృద్విషాలు మంచి ఆరంభం ఇచ్చారు. ఇద్దరు పోటాపోటీగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును 50 పరుగులు దాటించారు. 8వ ఓవర్లో ధావన్‌ను దీపక్ హుడా పెవిలియన్‌కు పంపాడు. 11వ ఓవర్ రెండో బంతికి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను.. చివరి బంతికి పృథ్వీ షాను ఖలీల్ ఔట్ చేశాడు. అప్పటికే అర్ధ సెంచరీ చేసి ఊపుమీదున్న షా పెవిలియన్ చేరడంతో ఖలీల్ విచిత్రంగా సంబరాలు చేసుకున్నాడు. చేతిలో నంబర్స్ నొక్కి.. హలో అంటూ మైదానంలో పరుగెత్తుతూ 'ఫోన్ కాల్' సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు.
దీనికి సంబందించిన వీడియోను ఐపీఎల్ తన అధికారిక ట్విట్టర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఇక నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్ చేస్తున్నారు. ‘నా ఆట చూడమంటూ చీఫ్ సెలక్టర్‌కు ఫోన్ చేస్తున్నాడు’,,‘మ్యాచ్ గెలుస్తున్నాం అని ఎవరికో కాల్ చేశాడు’అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సందర్బంగా కోహ్లిని ఔట్ చేసిన తర్వాత కూడా ఖలీల్ చిత్రమైన రీతిలో సంబరాలు చేసుకున్నాడు. దీంతో మ్యాచ్ అనంతరం ఖలీల్‌ను కోహ్లి ఆటపట్టిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment