విశాఖపట్నం: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్వాలిఫయర్ 2లో భాగంగా మూడు సార్లు చాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతోంది. శుక్రవారం స్థానిక వైఎస్సార్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే తొలుత బౌలింగ్ ఎంచుకుంది. నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఛేదన వైపే సీఎస్‌కే సారథి ధోని మొగ్గు చూపాడు. ఇక ఈ మ్యాచ్ కోసం సీఎస్‌కే ఒక్క మార్పు చేసింది. బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్‌ను తప్పించి పేసర్ శార్దూల్ ఠాకూర్‌ను తీసుకుంది. ఢిల్లీ ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఎలిమినేటర్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి దిల్లీ ఈ మ్యాచ్‌కు అర్హత సాధించగా క్వాలిఫయర్-1లో ముంబై చేతిలో ఓడిన చెన్నై, లీగ్‌లో టాప్-2 ఫినిషర్‌గా ఫైనల్ కోసం ఆడేందుకు మరో అవకాశం దక్కించుకుంది.
అపార అనుభవం ఆలంబనగా ఉన్న చెన్నై, యువ రక్తం ఉరకలేస్తున్న ఢిల్లీ జట్లు శుక్రవారం తలపడబోయే ఈ క్వాలిఫయిర్ మ్యాచ్ క్రికెట్ అభిమానులకు పండగలా, దండిగా సందడిని అందజేయడం గ్యారంటీ అని ఇప్పటి పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఈ మ్యాచ్‌లో గెలవనున్న జట్టు హైదరాబాద్‌లో జరగనున్న ఫైనల్లో ముంబై ఇండియన్స్‌ను సవాలు చేయబోతోంది. అందుకే వైఎస్సార్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌కు ఎక్కడ లేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇరుజట్లు బౌలింగ్‌లో మేటిగా ఉండటం... స్పి న్నర్లు పిచ్‌ను అనువుగా మార్చుకుని బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చేవారే కావడంతో ఫ్లాట్ పిచ్‌పై పరుగుల వరద ఎలా పారుతుందో వేచి చూడాల్సిందే. చెన్నై పేసర్ దీపక్ చహర్ పవర్‌ప్లేలో చెలరేగిపోతున్నాడు. ఐíపీఎల్‌లో ఇరుజట్లు 20సార్లు తలపడగా సూపర్ కింగ్స్ 14సార్లు విజయం సాధించగా ఢిల్లీ ఆరుసార్లు మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుత సీజన్‌లో రెండు రౌండ్లలోనూ సూపర్‌కింగ్సే విజయం సాధించింది. చెన్నై జోరుకు ఢిల్లీ అడ్డుకుంటుందో లేక చెన్నై ఈ సీజన్‌లో ఢిల్లీపై మూడోసారి విజయాన్ని సాధించి మరోసారి టైటిల్ పోరుకు సిద్ధమౌతుందో లేదో చూడాలి.
తుదిజట్లు
సీఎస్‌కే: ఎంఎస్ ధోని(కెప్టెన్), డుప్లెసిస్, వాట్సన్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహీర్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్
ఢిల్లీ: శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శిఖర్ ధావన్, పృథ్వీ షా, రిషభ్ పంత్, కోలిన్ మున్రో, అక్షర్‌పటేల్, రూథర్‌ఫర్డ్, కీమో పాల్, ఇషాంత్ శర్మ, అమిత్ మిశ్రా, ట్రెంట్ బౌల్ట్
Comments
Please login to add a commentAdd a comment