సెంటిమెంట్ కలిసొస్తుందా
సన్‌రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్‌లో ప్రస్తుతం ఉన్న జట్లలో అందరికంటే జూనియర్ సన్‌రైజర్స్ హైదరాబాద్. డెక్కన్ చార్జర్స్ స్థానంలో గత ఏడాది లీగ్‌లో అడుగుపెట్టింది. అయితే రెండో సీజన్ నగరానికి చెందిన జట్టుకు కలిసొస్తుందనేది ఓ సెంటిమెంట్. దీనికి రెండు కారణాలు. చార్జర్స్ తాము ఆడిన రెండో సీజన్‌లో గెలిచింది. పైగా... ఆ సీజన్‌లో మ్యాచ్ లు భారత్ బయట జరిగాయి. ఈసారి కూడా కొన్ని మ్యాచ్‌లు భారత్ బయట (యూఏఈలో) జరుగుతుండటం, తమకు ఇది రెండో సీజన్ కావడంతో సెంటిమెంట్ పరంగా సన్‌రైజర్స్ ఆశావహంగా ఉంది.
స్వదేశీ కెప్టెన్
తొలి సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లు మినహాయిస్తే హైదరాబాద్ జట్టుకు విదేశీ ఆటగాళ్లే కెప్టెన్లుగా వ్యవహరించారు. కానీ సన్‌రైజర్స్ మాత్రం స్వదేశీ ఆటగాడు శిఖర్ ధావన్ సారథ్యంలో బరిలోకి దిగుతోంది. కొత్త లుక్‌తో 2013 సీజన్‌లో అరంగేట్రం చేసిన ‘సన్ గ్రూప్’ ప్లే ఆఫ్ దశకు చేరడంతో పాటు చాంపియన్స్ లీగ్ ఆడింది. ఇక ఈ సారి జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహిస్తున్నాడు. తనతో పాటు స్టెయిన్‌ను మాత్రమే రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్... ఫిబ్రవరిలో బెంగళూరులో జరిగిన వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి మంచి ఆటగాళ్లను కొనుక్కుంది.
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను రూ. 5.5 కోట్లకు కొనుగోలు చేసింది. స్పిన్నర్ అమిత్ మిశ్రాను రూ. 4.75 కోట్లకు, ఆరోన్ ఫించ్‌ను రూ. 4 కోట్లకు దక్కించుకుంది. స్యామీ లాంటి బీభత్సమైన ఆల్‌రౌండర్‌ను తీసుకుంది. మొత్తానికి భారత క్రికెటర్లు, విదేశీ ప్లేయర్లు, దేశవాళీ ఆటగాళ్లతో సమతూకంతో, పటిష్టంగా కనిపిస్తోంది.
బలాలు...
డేవిడ్ వార్నర్, శిఖర్ ధావన్, ఆరోన్ ఫించ్‌లతో టాప్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది. డారెన్ స్యామీ, ఇర్ఫాన్ పఠాన్, మొయిస్ హెన్రిక్స్ అటు బౌలింగ్‌లో, ఇటు బ్యాటింగ్‌లో సత్తా చాటగలరు. బ్రెండన్ టేలర్, నమన్ ఓజా రూపంలో ధాటిగా బ్యాటింగ్ చేయగల వికెట్ కీపర్లు జట్టులో ఉన్నారు. మెరుపు బంతులతో చెలరే గే స్పీడ్ గన్ డేల్ స్టెయిన్, స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించే అమిత్ మిశ్రా బౌలింగ్‌లో ప్రధాన ఆయుధాలు.
బలహీనతలు...
లోయర్ ఆర్డర్‌లో జట్టుకు అండగా నిలిచే బలమైన దేశవాళీ బ్యాట్స్‌మెన్ లేకపోవడం సన్‌రైజర్స్ బలహీనత.. ఇది మినహా జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది.
జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్లు: శిఖర్ ధావన్ (కెప్టెన్), అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, ఇర్ఫాన్ పఠాన్, నమన్ ఓజా, వేణుగోపాల్‌రావు.
విదేశీ క్రికెటర్లు: డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా), వార్నర్, ఫించ్, హెన్రిక్స్ (ఆస్ట్రేలియా), స్యామీ, హోల్డర్ (వెస్టిండీస్), టేలర్ (జింబాబ్వే).
భారత దేశవాళీ క్రికెటర్లు: పర్వేజ్ రసూల్, కరణ్ శర్మ, లోకేశ్ రాహుల్, ప్రశాంత్ పరమేశ్వరన్, అమిత్ పౌనికర్, ఆశిష్‌రెడ్డి, అనిరుద్ధ శ్రీకాంత్, రికీ భుయ్, సీవీ మిలింద్, మన్‌ప్రీత్ జునేజా.