డెక్కన్ చార్జర్స్ ఆశలు
న్యూఢిల్లీ: ఐపీఎల్ నుంచి బయటకు వెళ్లిపోయిన జట్టు డె క్కన్ చార్జర్స్ మళ్లీ పునరాగమనంపై ఆశలు పెంచుకుంది. ఈ జట్టుకు బీసీసీఐకి మధ్య ఉన్న కేసును ఆర్బిట్రేటర్ ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఈ నెలాఖరులో ఆర్బిట్రేటర్ తుది తీర్పు ఇచ్చే అవకాశం ఉంది. ఇటీవల కొచ్చి టస్కర్స్ విషయంలో ఆర్బిట్రేటర్ ఐపీఎల్ జట్టుకు అనుకూలంగా తీర్పు ఇచ్చి రూ.550 కోట్లు పరిహారం ఇవ్వాలని బీసీసీఐని ఆదేశించారు. కాబట్టి తమ జట్టు విషయంలో కూడా తీర్పు అనుకూలంగానే ఉంటుందని డీసీ జట్టు వర్గాలు భావిస్తున్నాయి.
ఏమాత్రం అవకాశం దొరికినా పునరాగమనం చేయాలని భావిస్తున్నారు. 2009 లో డెక్కన్ చార్జర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవగా.. మూడు సంవత్సరాల అనంతరం 2012 లో ఆర్థికపరమైన ఇబ్బందులతో ఐపీఎల్ నుంచి బహిష్కరణకు గురైంది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌కు వేరే జట్టు ఉన్నందున... మరో నగరం నుంచి అయినా సరే డెక్కన్ చార్జర్స్‌ను నడపాలనేది ఆలోచన. మరి వీళ్ల అదృష్టం ఎలా ఉంటుందో చూడాలి.