విశాఖ స్పోర్ట్స్: వైజాగ్‌లో క్రికెట్ వీరాభిమానులకు మండు వేసవిలో మహా కూల్ వార్త! ఐపీఎల్ తుది ఘట్టంలో రెండు కీలక మ్యాచ్‌లు విశాఖలో జరగబోతున్నాయి. విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ వీడీసీఏ క్రికెట్ స్టేడియం మరోసారి ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదికగా నిలిచింది.ఈసారి ఏకంగా ఐపీఎల్ నాకౌట్ మ్యాచ్‌లనే సొంతం చేసుకుంది. తుదిపోరుకు అర్హత సాధించే జట్లను ఎంపిక చేసే నాకౌట్ మ్యాచ్‌లు విశాఖలోనే జరగనున్నాయి. ప్రస్తుత 12వ ఎడిషన్ ఐపీఎల్‌లో తొలినాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు టైటిల్ పోరుకు తలపడేది విశాఖలోనే. తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ చెన్నైలో జరగనున్నా...ఎలిమినేషన్ మ్యాచ్, రెండో క్వాలిఫయర్ మ్యాచ్ వైఎస్‌ఆర్ స్టేడియంలోనే జరగనున్నాయి. మే 8న జరిగే ఎలిమినేషన్ మ్యాచ్‌కు, మే10న జరిగే రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌కు వైఎస్‌ఆర్ స్టేడియమే వేదిక కానుంది.టైటిల్ పోరు హైదరాబాద్‌లో 12న జరగనుంది.
రెండు వారాల వ్యవధి చాలు
కేవలం రెండు వారాల వ్యవధి ఇస్తే చాలు ఎటువంటి ఫార్మాట్ మ్యాచ్‌కైనా సిద్ధమంటూ విశాఖ వైఎస్‌ఆర్ స్టేడియం సవాలును స్వీకరిస్తుంది. 2016లో కేవలం రెండు వారాల వ్యవధిలోనే మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించడమే కాక ఆతిథ్య జట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగానూ గుర్తింపు తెచ్చుకుంది. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ జట్లు సయితం హోమ్ పిచ్ అంటూ విశాఖ స్టేడియంకోసం పోటీపడ్డాయి. డెక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లే కాదు ఏకంగా ఒకేసారి రెండు ఫ్రాంచైజీలు హోమ్‌పిచ్‌గా ఎంచుకుని మ్యాచ్‌ల్ని ఇక్కడ నిర్వహించాయి. దేశంలోనే తొలి ప్రాధాన్యపు స్టేడియంగా వైఎస్‌ఆర్ స్టేడియం నిలిచింది.
గతంలోనూ చాన్స్
2012లో దక్కన్ చార్జర్స్ జట్టు హోమ్ గ్రౌండ్‌గా ఇక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా సన్‌రైజర్స్‌గా మారిన ఆదే జట్టు 2015లోనూ ఇక్కడ మ్యాచ్‌లాడింది. 2016లోనూ ఐపీఎల్ మ్యాచ్‌లకు విశాఖలోని వైఎస్‌ఆర్ స్టేడియం వేదికగా నిలిచింది. పూణే సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ జట్లు విశాఖను హోమ్ గ్రౌండ్‌గా ఎంపిక చేసుకుని మ్యాచ్‌లాడిన విషయం విదితమే. అప్పుడు లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించి ఆనందించిన విశాఖ క్రీడాభిమానులు ఈసారి ఏకంగా ఐపీఎల్ టోర్నీ టైటిల్ పోరుకు అర్హత సాధించే జట్లు పోటీ పడే ఎలిమినేటర్, క్వాలిఫయిర్ మ్యాచ్‌లను వీక్షించనున్నారు. మండు వేసవిలో ఇది మహా థ్రిల్ ఇచ్చే విషయమే మరి!
చెన్నై చేతులెత్తేసింది...
వాస్తవానికి ప్రస్తుత సీజన్ ఐపీఎల్ మ్యాచ్ తుదిదశ పోటీలకు చెన్నై వేదిక కావల్సి ఉంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఉన్న చెన్నై ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేదే. అయితే, చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మూడు స్టాండ్‌లను తెరిచే విషయంలో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) తమ అశక్తతను తెలియజేయడంతో చెన్నైకి కేవలం ఒక క్వాలిఫయిర్ మ్యాచ్ నిర్వహణకు మాత్రం అవకాశం దక్కింది. స్టేడియంలో మూడు స్టాండ్‌లు చాలాకాలంగా మూతపడి ఉన్నాయి. వీటిని తెరవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతించలేదని టీఎన్‌సీఏ స్పష్టం చేయడంతో అక్కడ ఒక్క క్వాలిఫయిర్ మ్యాచ్ నిర్వహణకే ఐపీఎల్ నిర్వాహక కమిటీ సమ్మతించింది. కోట్లలో ఆదాయాన్ని ఒదులుకోవడం ఇష్టంలేని బీసీసీఐ ఈ మూడు స్టాండ్‌లను తెరవాలని పట్టుబడుతోంది. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోగల రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంకు ఫైనల్ నిర్వహించే అవకాశం దక్కడంతో క్వాలిఫైయర్, ఎలిమినేషన్ మ్యాచ్‌లకు వైఎస్‌ఆర్ స్టేడియమే వేదికైంది. ఎన్నికల నేపథ్యంలో ముంబై, బెంగళూరులలో కూడా పరిస్థితి మ్యాచ్‌ల నిర్వహణకు అనుకూలంగా లేకపోవడంతో విశాఖకు మళ్లీ లక్కీగా అవకాశం అందివచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment