ఖేల్ ఖతం
అడ్డదారుల్లో సులువుగా డబ్బు సంపాదించాలని ఆరాటపడిన భారత క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు శ్రీశాంత్... అతని సహచరుడు అంకిత్ చవాన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఐపీఎల్-6లో బెట్టింగ్ ఉచ్చులో పడి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వీరిపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. జీవిత కాలంలో వీరు క్రికెట్ ఆడరాదంటూ ఆదేశించింది. తద్వారా ఈ ఆటగాళ్లు తమ కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించుకున్నట్టయ్యింది.
న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ క్రికెట్ కెరీర్ అవమానకర రీతిలో ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరో సీజన్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఈ కేరళ ఆటగాడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొరడా ఝుళిపించింది. ఫిక్సర్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఆది నుంచీ చెబుతూ వస్తున్న బోర్డు అందుకు తగ్గట్టుగానే శ్రీశాంత్‌పై క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం విధించింది. అతనితోపాటు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ముంబై రంజీ జట్టు స్పిన్నర్ అంకిత్ చవాన్ కూడా ఇదే శిక్షను ఎదుర్కోనున్నాడు. శుక్రవారం జరిగిన బోర్డు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
వీరిద్దరితోపాటు బుకీగా మారిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ సభ్యుడు, గుజరాత్ క్రికెటర్ అమిత్ సింగ్‌పై ఐదేళ్ల నిషేధం... విషయం తెలిసినప్పటికీ అధికారులకు తెలపకుండా ఉన్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ్ త్రివేదిపై ఏడాది పాటు వేటు పడింది. తమపై ఉన్న నిషేధం సమయంలో వీరు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌ల్లో పాలుపంచుకోకూడదు. అలాగే బోర్డు దాని గుర్తింపు సంఘాలతో కలిసి ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించేందుకు అనుమతి ఉండదు. మరోవైపు సరైన ఆధారాలు లేని కారణంగా స్పిన్నర్ హర్మీత్ సింగ్‌కు ఊరట లభించింది. బుకీలు సంప్రదించిన విషయాన్ని వెల్లడించనందుకు అతడిని మందలించారు.
చండిలాపై త్వరలో నిర్ణయం...
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ వ్యవహారం గత మే నెలలో బయటపడగానే బీసీసీఐ తమ అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ నేతృత్వంలో విచారణ కమిటీ వేసింది. ఆయన ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని బోర్డు క్రమశిక్షణ కమిటీ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. విచారణ సమయంలో అజిత్ చండిలా జైలులో ఉండడంతో అతడిని వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం చిక్కలేదు. దీంతో ఈ ఆటగాడిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అతడు కూడా బెయిల్‌పై విడుదల కావడంతో త్వరలోనే రవి సవానీ కలుసుకునే అవకాశం ఉంది. ‘తగిన సాక్ష్యాధారాలతో పాటు స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి రూపొందించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నాం. క్షుణ్ణంగా పరిశీలించాకే క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. గత నెలలో కోల్‌కతాలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో సవానీ ఈ నివేదికను సమర్పించారు.
దయ చూపాల్సిన అవసరం లేదు: సవానీ
స్పాట్ ఫిక్సర్లపై బోర్డు తరఫున విచారణ చేసిన అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ తన నివేదికలో పలు విషయాలు పేర్కొన్నారు. ‘ఫిక్సింగ్‌కు పాల్పడిన ఈ ఆటగాళ్లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్రీశాంత్ ఇప్పటికే చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే తొలి టి20 ప్రపంచకప్ టోర్నీ, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడుగా ఉన్నాడు.
చాలా సందర్భాల్లో ఐసీసీ ఏసీఎస్‌యూ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్-6కు ముందు కూడా తనతోపాటు ఫిక్సింగ్ చేసిన ఇతర ఆటగాళ్లు ఈ అవగాహన శిబిరంలో ఉన్నారు. అవినీతి నిరోధక పాఠాలు వీరిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అందుకే వీరిపై ఎలాంటి దయ చూపాల్సిన అవసరం లేదు’ అని సవానీ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆటగాళ్లపై ఐదేళ్ల నుంచి జీవితకాల నిషేధం విధించాలని బోర్డుకు సూచించారు.
బీసీసీఐ వేటు ఆశ్చర్యకరం: శ్రీశాంత్
బీసీసీఐ తనపై జీవిత కాల నిషేధం విధించడం పట్ల పేసర్ శ్రీశాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘న్యూస్ చానెల్స్ చూస్తుండగా విషయం తెలిసింది. నాపై జీవిత కాల బహిష్కరణా..? చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. అయితే వెంటనే ఈ ట్వీట్‌ను శ్రీశాంత్ తొలగించాడు.
కమిటీ ముందు హాజరైన ఆటగాళ్లు
బీసీసీఐ నిర్ణయానికి ముందు శ్రీశాంత్, అంకిత్ చవాన్, చండిలా, హర్మీత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. ‘కమిటీ సభ్యులు ఎంతో సహకరించారు. వారికి నా వాదనను సమర్థవంతంగా వినిపించాను. భారత్‌కు ఆడాలనేది నా చిన్నప్పటి కల. అలాంటిది క్రికెట్‌ను నేను ఎప్పటికీ మోసం చేయలేను. వారు నిషేధం గురించి ఏమీ చెప్పలేదు. బీసీసీఐతో పాటు భారత న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. ఈ మొత్తం వ్యవహారం నుంచి సచ్ఛీలుడిగా బయటపడతాను’ అని కమిటీ ముందు హాజరైన అనంతరం శ్రీశాంత్ అన్నాడు.
సమావేశానికి హాజరైన శ్రీనివాసన్
బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న ఎన్.శ్రీనివాసన్ శుక్రవారం జరిగిన క్రమశిక్షణ కమిటీకి హాజరయ్యారు. వాస్తవానికి ఉపాధ్యక్షులు అరుణ్ జైట్లీ, నిరంజన్ షా సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి బోర్డు అధ్యక్షుడి హోదాలో ఆయనే నేతృత్వం వహించాలి. కానీ అల్లుడు గురునాథ్ బెట్టింగ్ వ్యవహారంలో ఆయన పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకోవడంతో ఇద్దరు సభ్యులు మాత్రమే హాజరవుతారని భావించినా శ్రీనివాసన్ కమిటీకి అధ్యక్షత వహించారు.