cricket carrer
-
ఎంసీఏకు చవాన్ లేఖ
ముంబై: తన క్రికెట్ కెరీర్‌ను తిరిగి కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు చవాన్ అధికారికంగా విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు ఓ లేఖను రాశాడు. అయితే ఆగస్టు 2న ఎంసీఏ దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఆదివారం జరిగే సమావేశంలో ఎంసీఏ అధ్యక్షుడు శరద్ పవార్, ఇతర కమిటీ సభ్యుల ముందు ఈ లేఖను ఉంచుతామని సంయుక్త కార్యదర్శి డాక్టర్ పీవీ షెట్టి తెలిపారు. కమిటీ నిర్ణయం ఎలా ఉన్నా.. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ చేతుల్లోనే ఉంటుందన్నారు. -
ఫైనల్లో భారత్ ‘ఎ’
ఆస్ట్రేలియా ‘ఎ’పై ఘనవిజయం నాలుగు దేశాల వన్డే టోర్నీ డార్విన్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత్ ‘ఎ’ ఫైనల్‌కు చేరింది. గురువారం ఆస్ట్రేలియా ‘ఎ’తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనోజ్ తివారి బౌలర్‌గా రాణించి లిస్ట్ ‘ఎ’ క్రికెట్ కెరీర్లో తొలిసారిగా ఐదు వికెట్లు (5/34) పడగొట్టాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్టాయినిస్ (61 బంతుల్లో 58; 9 ఫోర్లు), ఫిలిప్ హ్యూజెస్ (87 బంతుల్లో 58; 4 ఫోర్లు, 1 సిక్స్)లు అర్ధసెంచరీలు సాధించారు. అనంతరం భారత్ ‘ఎ’ 47.5 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 231 పరుగులు చేసి గెలిచింది. అంబటి రాయుడు (112 బంతుల్లో 77; 8 ఫోర్లు), కేదార్ జాదవ్ (50 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సంజూ శామ్సన్ (51 బంతుల్లో 49 నాటౌట్; 5 ఫోర్లు) రాణించారు. ఇక శనివారం భారత్ ‘ఎ’, ఆసీస్ ‘ఎ’ల మధ్యే తుదిపోరు జరగనుంది. -
ఎవరిస్తారు స్ఫూర్తి!
న్యూఢిల్లీ: క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, క్రికెట్ బోర్డులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సచిన్ వీడ్కోలు తర్వాత భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారు ఉండరని ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాలోని యువ క్రికెటర్లకు ఇది పెద్ద లోటని చెప్పాడు. మాస్టర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే గొప్ప అవకాశాన్ని యువకులతో పాటు భావితరాలు కోల్పోతున్నాయన్నాడు. ‘సచిన్ ఓ లివింగ్ లెజెండ్. అతనిలా స్ఫూర్తినిచ్చే వారు లేరు. యువకులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు. నేను అతనికంటే ఏడేళ్లు జూనియర్ని. డ్రెస్సింగ్ రూమ్‌లో కిట్ పడేసి నేరుగా అతని వద్దకు వెళ్లి మాట్లాడేవాణ్ని. ఓ స్థాయి వరకు మాస్టర్ నుంచి చాలా స్ఫూర్తి పొందాను. అతను లేని లోటును పూరించడానికి చాలా సమయం పడుతుంది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. సచిన్ అందరికీ అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తి అని కితాబిచ్చాడు. ఏ విషయాన్నైనా అతనితో చర్చించే అవకాశం ఉంటుందన్నాడు. ‘మాస్టర్ ఓ సూపర్ స్టార్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత క్రికెట్లో అతను ఎదిగిన తీరు, సాధించిన ఘనతలు అద్భుతం. చివరి పదేళ్లలో భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు. రిటైర్మెంట్ నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కాబట్టి సరైన సమయంలోనే తీసుకున్నాడు. సొంత అభిమానుల మధ్య ముంబైలో మ్యాచ్ జరిగితే చాలా బాగుంటుంది’ అని ద్రవిడ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టి20లో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించిన యువరాజ్ సింగ్ (77 నాటౌట్).. తన ఇన్నింగ్స్‌ను మాస్టర్‌కు అంకితమిచ్చాడు. ఈ విషయాన్ని ఫోన్లో అతనికి చెబుతానని చెప్పాడు. మాస్టర్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరాడు. సమకాలిన క్రికెట్లో సచిన్‌ను మించిన ఆటగాడు లేడని ఆసీస్ మీడియా కితాబిచ్చింది. క్రికెట్ చరిత్రలో డాన్ బ్రాడ్‌మన్, మాస్టరే దిగ్గజ బ్యాట్స్‌మెన్ అని ప్రశంసించింది. ‘క్రికెట్ నుంచి సచిన్ అనే దేవుడు నిష్ర్కమిస్తున్నాడు’ అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వ్యాఖ్యానించగా; ‘క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్ సచిన్, బ్రాడ్‌మన్ అనే నిజాన్ని ఒప్పుకోవాల్సిందే’నని డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది. ‘సచిన్ ఓ సూపర్ హీరో’ అంటూ ఆకాశానికెత్తేసిన ఇంగ్లిష్ మీడియా... పీలే, ఫెడరర్‌లతో పోలుస్తూ పలు కథనాలు ప్రచురించింది. క్రికెట్లో ఉన్న అన్ని రికార్డులను సొంతం చేసుకున్న ‘సూపర్ హ్యూమన్’ మాస్టర్ అంటూ మిర్రర్ పేర్కొంది. ఎక్కడైనా క్రికెటర్లకు గౌరవం మాత్రమే లభిస్తుంది కానీ భారత్‌లో సచిన్‌ను దేవుడితో సమానంగా కొలుస్తారని వ్యాఖ్యానించింది. సచిన్ ఓ ‘గ్లోబల్ సూపర్ స్టార్’ అని స్కై స్పోర్ట్స్ తెలిపింది. మరికొంత కాలం క్రికెట్ ఆడకుండా సచిన్ సరైన నిర్ణయం తీసుకున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ విశ్లేషించారు. వీడ్కోలు నిర్ణయం సంతోషాన్ని కలిగించిందన్నారు. కోట్లాది మంది అభిమానుల మధ్య 24 ఏళ్ల కెరీర్‌ను అత్యంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడని కితాబిచ్చారు. ‘మా తరంలో అత్యద్భుత క్రికెటర్ సచిన్’ అంటూ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసించాడు. సచిన్ రిటైర్మెంట్ ఇంకా ముగియలేదు. ఈ అంశంపై నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నా. కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు రావడం లేదు’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న ఆచ్రేకర్ ముంబై: ఆరోగ్య సమస్యల కారణంగా సరిగా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నా... తన శిష్యుడు సచిన్ చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె కల్పన వెల్లడించారు. ‘ఇది ఓ భావోద్వేగ సమయమని నాన్న చెబుతున్నారు. 200వ టెస్టుకు సాక్షిగా నిలవాలని కోరుకుంటున్నారు. సచిన్ రిటైర్మెంట్ బాధ కలిగిస్తోందని, మరికొంత కాలం ఆడితే బాగుండే దని అనుకుంటున్నారు. మాస్టర్ వీడ్కోలు తర్వాత నాన్న టీవీ చూడటం తగ్గిస్తారు. గురువారం కూడా సచిన్ ఫోన్ చేసి, త్వరలో వచ్చి కలుస్తానని నాన్నతో చెప్పాడు. ఇటీవల వచ్చినప్పుడు రెండు గంటలు కూర్చుని అర్జున్ గురించి మాట్లాడాడు. కానీ రిటైర్మెంట్ విషయం చర్చకు రాలేదు’ అని కల్పన తెలిపారు. వాంఖడేలో ఆడతా : బోర్డును కోరిన సచిన్ ముంబై: బంధువులు, స్నేహితుల సమక్షంలో ప్రతిష్టాత్మక 200వ టెస్టును వాంఖడే స్టేడియంలోనే సచిన్ ఆడాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ కోశాధికారి రవి సావంత్ చెప్పారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని మాస్టర్ బీసీసీఐకి చెప్పాడని ఆయన తెలిపారు. కాబట్టి సచిన్ కోరిక మేరకు బోర్డు వాంఖడేకు ఈ మ్యాచ్‌ను కేటాయించే అవకాశం ఉందని సావంత్ చెప్పారు. శుక్రవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో సమావేశమైన తర్వాత సావంత్ ఈ ప్రకటన చేశారు. రాజీవ్ శుక్లా నేతృత్వంలోని బోర్డు పర్యటనల కమిటీ మంగళవారం సమావేశమై విండీస్‌తో సిరీస్‌కు వేదికలు ఖరారు చేయనుంది. ఆ సమావేశం తర్వాత ఈ టెస్టు వేదికపై అధికారిక ప్రకటన రావచ్చు. సచిన్‌కు ఎవరూ ఊహించని స్థాయిలో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. -
ఖేల్ ఖతం
అడ్డదారుల్లో సులువుగా డబ్బు సంపాదించాలని ఆరాటపడిన భారత క్రికెటర్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సభ్యుడు శ్రీశాంత్... అతని సహచరుడు అంకిత్ చవాన్ తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఐపీఎల్-6లో బెట్టింగ్ ఉచ్చులో పడి స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన వీరిపై బీసీసీఐ కొరడా ఝళిపించింది. జీవిత కాలంలో వీరు క్రికెట్ ఆడరాదంటూ ఆదేశించింది. తద్వారా ఈ ఆటగాళ్లు తమ కెరీర్‌ను అర్ధాంతరంగా ముగించుకున్నట్టయ్యింది. న్యూఢిల్లీ: వివాదాస్పద పేసర్‌గా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్ క్రికెట్ కెరీర్ అవమానకర రీతిలో ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరో సీజన్లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు ఈ కేరళ ఆటగాడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కొరడా ఝుళిపించింది. ఫిక్సర్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఆది నుంచీ చెబుతూ వస్తున్న బోర్డు అందుకు తగ్గట్టుగానే శ్రీశాంత్‌పై క్రికెట్ నుంచి జీవితకాల నిషేధం విధించింది. అతనితోపాటు రాజస్థాన్ రాయల్స్‌కు ఆడిన ముంబై రంజీ జట్టు స్పిన్నర్ అంకిత్ చవాన్ కూడా ఇదే శిక్షను ఎదుర్కోనున్నాడు. శుక్రవారం జరిగిన బోర్డు క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరితోపాటు బుకీగా మారిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ సభ్యుడు, గుజరాత్ క్రికెటర్ అమిత్ సింగ్‌పై ఐదేళ్ల నిషేధం... విషయం తెలిసినప్పటికీ అధికారులకు తెలపకుండా ఉన్న రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ్ త్రివేదిపై ఏడాది పాటు వేటు పడింది. తమపై ఉన్న నిషేధం సమయంలో వీరు ఎలాంటి క్రికెట్ మ్యాచ్‌ల్లో పాలుపంచుకోకూడదు. అలాగే బోర్డు దాని గుర్తింపు సంఘాలతో కలిసి ఎలాంటి కార్యక్రమాల్లోనూ కనిపించేందుకు అనుమతి ఉండదు. మరోవైపు సరైన ఆధారాలు లేని కారణంగా స్పిన్నర్ హర్మీత్ సింగ్‌కు ఊరట లభించింది. బుకీలు సంప్రదించిన విషయాన్ని వెల్లడించనందుకు అతడిని మందలించారు. చండిలాపై త్వరలో నిర్ణయం... దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఈ వ్యవహారం గత మే నెలలో బయటపడగానే బీసీసీఐ తమ అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ నేతృత్వంలో విచారణ కమిటీ వేసింది. ఆయన ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని బోర్డు క్రమశిక్షణ కమిటీ తమ నిర్ణయాన్ని వెల్లడించింది. విచారణ సమయంలో అజిత్ చండిలా జైలులో ఉండడంతో అతడిని వ్యక్తిగతంగా కలుసుకునే అవకాశం చిక్కలేదు. దీంతో ఈ ఆటగాడిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే ప్రస్తుతం అతడు కూడా బెయిల్‌పై విడుదల కావడంతో త్వరలోనే రవి సవానీ కలుసుకునే అవకాశం ఉంది. ‘తగిన సాక్ష్యాధారాలతో పాటు స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుక్కున్న ఆటగాళ్లను వ్యక్తిగతంగా కలిసి రూపొందించిన నివేదికను పరిగణనలోకి తీసుకున్నాం. క్షుణ్ణంగా పరిశీలించాకే క్రమశిక్షణ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది’ అని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. గత నెలలో కోల్‌కతాలో జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో సవానీ ఈ నివేదికను సమర్పించారు. దయ చూపాల్సిన అవసరం లేదు: సవానీ స్పాట్ ఫిక్సర్లపై బోర్డు తరఫున విచారణ చేసిన అవినీతి వ్యతిరేక యూనిట్ చీఫ్ రవి సవానీ తన నివేదికలో పలు విషయాలు పేర్కొన్నారు. ‘ఫిక్సింగ్‌కు పాల్పడిన ఈ ఆటగాళ్లకు ఎలాంటి మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం లేదు. శ్రీశాంత్ ఇప్పటికే చాలా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అలాగే తొలి టి20 ప్రపంచకప్ టోర్నీ, 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఐసీసీ ఏసీఎస్‌యూ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఐపీఎల్-6కు ముందు కూడా తనతోపాటు ఫిక్సింగ్ చేసిన ఇతర ఆటగాళ్లు ఈ అవగాహన శిబిరంలో ఉన్నారు. అవినీతి నిరోధక పాఠాలు వీరిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. అందుకే వీరిపై ఎలాంటి దయ చూపాల్సిన అవసరం లేదు’ అని సవానీ నివేదికలో పేర్కొన్నారు. ఈ ఆటగాళ్లపై ఐదేళ్ల నుంచి జీవితకాల నిషేధం విధించాలని బోర్డుకు సూచించారు. బీసీసీఐ వేటు ఆశ్చర్యకరం: శ్రీశాంత్ బీసీసీఐ తనపై జీవిత కాల నిషేధం విధించడం పట్ల పేసర్ శ్రీశాంత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘న్యూస్ చానెల్స్ చూస్తుండగా విషయం తెలిసింది. నాపై జీవిత కాల బహిష్కరణా..? చాలా ఆశ్చర్యంగా ఉంది’ అని ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే వెంటనే ఈ ట్వీట్‌ను శ్రీశాంత్ తొలగించాడు. కమిటీ ముందు హాజరైన ఆటగాళ్లు బీసీసీఐ నిర్ణయానికి ముందు శ్రీశాంత్, అంకిత్ చవాన్, చండిలా, హర్మీత్ సింగ్, సిద్ధార్థ్ త్రివేది క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై తమ వాదనలు వినిపించారు. ‘కమిటీ సభ్యులు ఎంతో సహకరించారు. వారికి నా వాదనను సమర్థవంతంగా వినిపించాను. భారత్‌కు ఆడాలనేది నా చిన్నప్పటి కల. అలాంటిది క్రికెట్‌ను నేను ఎప్పటికీ మోసం చేయలేను. వారు నిషేధం గురించి ఏమీ చెప్పలేదు. బీసీసీఐతో పాటు భారత న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. ఈ మొత్తం వ్యవహారం నుంచి సచ్ఛీలుడిగా బయటపడతాను’ అని కమిటీ ముందు హాజరైన అనంతరం శ్రీశాంత్ అన్నాడు. సమావేశానికి హాజరైన శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న ఎన్.శ్రీనివాసన్ శుక్రవారం జరిగిన క్రమశిక్షణ కమిటీకి హాజరయ్యారు. వాస్తవానికి ఉపాధ్యక్షులు అరుణ్ జైట్లీ, నిరంజన్ షా సభ్యులుగా ఉన్న ఈ కమిటీకి బోర్డు అధ్యక్షుడి హోదాలో ఆయనే నేతృత్వం వహించాలి. కానీ అల్లుడు గురునాథ్ బెట్టింగ్ వ్యవహారంలో ఆయన పదవి నుంచి తాత్కాలికంగా తప్పుకోవడంతో ఇద్దరు సభ్యులు మాత్రమే హాజరవుతారని భావించినా శ్రీనివాసన్ కమిటీకి అధ్యక్షత వహించారు.