ఎవరిస్తారు స్ఫూర్తి! | Sachin Tendulkar must have known from his heart: Rahul Dravid | Sakshi
Sakshi News home page

ఎవరిస్తారు స్ఫూర్తి!

Published Sat, Oct 12 2013 1:03 AM | Last Updated on Fri, Sep 1 2017 11:34 PM

ఎవరిస్తారు స్ఫూర్తి!

ఎవరిస్తారు స్ఫూర్తి!

న్యూఢిల్లీ: క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. మాజీ ఆటగాళ్లు, కోచ్‌లు, క్రికెట్ బోర్డులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
 
  సచిన్ వీడ్కోలు తర్వాత భావితరాలకు స్ఫూర్తినిచ్చే వారు ఉండరని ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియాలోని యువ క్రికెటర్లకు ఇది పెద్ద లోటని చెప్పాడు. మాస్టర్‌తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకునే గొప్ప అవకాశాన్ని యువకులతో పాటు భావితరాలు కోల్పోతున్నాయన్నాడు. ‘సచిన్ ఓ లివింగ్ లెజెండ్. అతనిలా స్ఫూర్తినిచ్చే వారు లేరు. యువకులు ఈ అవకాశాన్ని కోల్పోతున్నారు.
 
  నేను అతనికంటే ఏడేళ్లు జూనియర్‌ని. డ్రెస్సింగ్ రూమ్‌లో కిట్ పడేసి నేరుగా అతని వద్దకు వెళ్లి మాట్లాడేవాణ్ని. ఓ స్థాయి వరకు మాస్టర్ నుంచి చాలా స్ఫూర్తి పొందాను. అతను లేని లోటును పూరించడానికి చాలా సమయం పడుతుంది’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
 
  సచిన్ అందరికీ అందుబాటులో ఉండే గొప్ప వ్యక్తి అని కితాబిచ్చాడు. ఏ విషయాన్నైనా అతనితో చర్చించే అవకాశం ఉంటుందన్నాడు. ‘మాస్టర్ ఓ సూపర్ స్టార్. ఇందులో ఎలాంటి సందేహం లేదు. భారత క్రికెట్‌లో అతను ఎదిగిన తీరు, సాధించిన ఘనతలు అద్భుతం. చివరి పదేళ్లలో భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు. రిటైర్మెంట్ నిర్ణయం ఎప్పుడైనా తీసుకోవాల్సిందే కాబట్టి సరైన సమయంలోనే తీసుకున్నాడు. సొంత అభిమానుల మధ్య ముంబైలో మ్యాచ్ జరిగితే చాలా బాగుంటుంది’ అని ద్రవిడ్ వెల్లడించాడు.
 
  ఆస్ట్రేలియాతో జరిగిన ఏకైక టి20లో అద్భుతంగా ఆడి జట్టును గెలిపించిన యువరాజ్ సింగ్ (77 నాటౌట్).. తన ఇన్నింగ్స్‌ను మాస్టర్‌కు అంకితమిచ్చాడు. ఈ విషయాన్ని ఫోన్‌లో అతనికి చెబుతానని చెప్పాడు. మాస్టర్ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని కోరాడు.
 
  సమకాలిన క్రికెట్‌లో సచిన్‌ను మించిన ఆటగాడు లేడని ఆసీస్ మీడియా కితాబిచ్చింది. క్రికెట్ చరిత్రలో డాన్ బ్రాడ్‌మన్, మాస్టరే దిగ్గజ బ్యాట్స్‌మెన్ అని ప్రశంసించింది. ‘క్రికెట్ నుంచి సచిన్ అనే దేవుడు నిష్ర్కమిస్తున్నాడు’ అని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వ్యాఖ్యానించగా; ‘క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్‌మెన్ సచిన్, బ్రాడ్‌మన్ అనే నిజాన్ని ఒప్పుకోవాల్సిందే’నని డైలీ టెలిగ్రాఫ్ పేర్కొంది.
 
  ‘సచిన్ ఓ సూపర్ హీరో’ అంటూ ఆకాశానికెత్తేసిన ఇంగ్లిష్ మీడియా... పీలే, ఫెడరర్‌లతో పోలుస్తూ పలు కథనాలు ప్రచురించింది. క్రికెట్‌లో ఉన్న అన్ని రికార్డులను సొంతం చేసుకున్న ‘సూపర్ హ్యూమన్’ మాస్టర్ అంటూ మిర్రర్ పేర్కొంది. ఎక్కడైనా క్రికెటర్లకు గౌరవం మాత్రమే లభిస్తుంది కానీ భారత్‌లో సచిన్‌ను దేవుడితో సమానంగా కొలుస్తారని వ్యాఖ్యానించింది. సచిన్ ఓ ‘గ్లోబల్ సూపర్ స్టార్’ అని స్కై స్పోర్ట్స్ తెలిపింది.
 
  మరికొంత కాలం క్రికెట్ ఆడకుండా సచిన్ సరైన నిర్ణయం తీసుకున్నాడని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ విశ్లేషించారు. వీడ్కోలు నిర్ణయం సంతోషాన్ని కలిగించిందన్నారు. కోట్లాది మంది అభిమానుల మధ్య 24 ఏళ్ల కెరీర్‌ను అత్యంత దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాడని కితాబిచ్చారు.
 
  ‘మా తరంలో అత్యద్భుత క్రికెటర్ సచిన్’ అంటూ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రశంసించాడు.
  సచిన్ రిటైర్మెంట్ ఇంకా ముగియలేదు. ఈ అంశంపై నేను ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నా. కృతజ్ఞతలు చెప్పేందుకు మాటలు రావడం లేదు’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
 
 ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్న ఆచ్రేకర్
 ముంబై: ఆరోగ్య సమస్యల కారణంగా సరిగా నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నా... తన శిష్యుడు సచిన్ చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడాలని మాస్టర్ చిన్ననాటి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె కల్పన వెల్లడించారు. ‘ఇది ఓ భావోద్వేగ సమయమని నాన్న చెబుతున్నారు.
 
 
 200వ టెస్టుకు సాక్షిగా నిలవాలని కోరుకుంటున్నారు. సచిన్ రిటైర్మెంట్ బాధ కలిగిస్తోందని, మరికొంత కాలం ఆడితే బాగుండే దని అనుకుంటున్నారు. మాస్టర్ వీడ్కోలు తర్వాత నాన్న టీవీ చూడటం తగ్గిస్తారు. గురువారం కూడా సచిన్ ఫోన్ చేసి, త్వరలో వచ్చి కలుస్తానని నాన్నతో చెప్పాడు. ఇటీవల వచ్చినప్పుడు రెండు గంటలు కూర్చుని అర్జున్ గురించి మాట్లాడాడు. కానీ రిటైర్మెంట్ విషయం చర్చకు రాలేదు’ అని కల్పన తెలిపారు.
 
 వాంఖడేలో ఆడతా : బోర్డును కోరిన సచిన్
 ముంబై: బంధువులు, స్నేహితుల సమక్షంలో ప్రతిష్టాత్మక 200వ టెస్టును వాంఖడే స్టేడియంలోనే సచిన్ ఆడాలని కోరుకుంటున్నట్లు బీసీసీఐ కోశాధికారి రవి సావంత్ చెప్పారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని మాస్టర్ బీసీసీఐకి చెప్పాడని ఆయన తెలిపారు. కాబట్టి సచిన్ కోరిక మేరకు బోర్డు వాంఖడేకు ఈ మ్యాచ్‌ను కేటాయించే అవకాశం ఉందని సావంత్ చెప్పారు.
 
 శుక్రవారం బోర్డు ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు శ్రీనివాసన్‌తో సమావేశమైన తర్వాత సావంత్ ఈ ప్రకటన చేశారు. రాజీవ్ శుక్లా నేతృత్వంలోని బోర్డు పర్యటనల కమిటీ మంగళవారం సమావేశమై విండీస్‌తో సిరీస్‌కు వేదికలు ఖరారు చేయనుంది. ఆ సమావేశం తర్వాత ఈ టెస్టు వేదికపై అధికారిక ప్రకటన రావచ్చు. సచిన్‌కు ఎవరూ ఊహించని స్థాయిలో ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement