
ఐపీఎల్ ట్రోఫీ
సాక్షి, చెన్నై : మరి కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను నిలిపివేయాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రజావ్యాజ్యం కింద పిటిషన్ దాఖలు చేశారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌లు జరగకుండా నివారణ చర్యలు చేపట్టే వరకు ఐపీఎల్ నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇక ఎనిమిది ఐపీఎల్ జట్లను పిల్‌లో ప్రతివాదులుగా చేర్చారు.
పిల్ దాఖలు చేసిన ఐపీఎస్ అధికారి సంపత్ కుమార్ గతంలో చెన్నై దర్యాప్తు అధికారిగా పనిచేస్తున్న సమయంలో ఐపీఎల్ బుకీల నుంచి ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఐపీఎస్ అధికారి నాలుగు ఏళ్లపాటు సస్పెండ్ అయ్యారు. ఈ ఆరోపణల నేపథ్యంలో అతనిపై నమోదు చేసిన చార్జీషీట్లు కోట్టెయడంతో గత మార్చిలో తిరిగి ఉద్యోగంలో చేరారు.
ఐపీఎల్‌ను పూర్తిగా నిషేదించాలని తాను కోరుకోవడంల లేదని, కొత్త సీజన్ మొదలయ్యే ముందే బెట్టింగ్ నిరోధించే ఓ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నదే తన వినతి అని సంపత్ ఆ పిల్‌లో స్పష్టంచేశారు. తాను దాఖలు చేసిన పిల్‌ను బుధవారం విచారించే అవకాశం ఉందని ఆయన మీడియాకు తెలిపారు. ఇక ఈ సీజన్ ఆరంభ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఏప్రిల్ 7 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment