
మెక్ 'కల్లోలం' ఆపకుంటే...?
వెల్లింగ్టన్: మెక్ 'కల్లోలం'కు అడ్డుకట్ట పడడంతో ఇంగ్లీషు బౌలర్లు ఊపిరి పీల్చుకున్నారు. తమపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడిన బ్రెండన్ మెక్ కల్లమ్ పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ ఓటమి కాస్త ఆలస్యమైంది. అతడు కాసేపు క్రీజ్ లో ఉండివుంటే మ్యాచ్ 10 ఓవర్లలోపు ముగిసేదన్నది ఆట చూస్తున్నవారందరి భావన.
124 స్వల్ప స్కోరు ఛేదించేందుకు బరిలోకి దిగిన కివీస్ కెప్టెన్ రావడం రావడంతోనే బ్యాట్ ఝుళిపించాడు. ఇంగ్లీషు బౌలింగ్ ను ఊచకోత కోశాడు. బౌలర్ బంతిని వదలడం పాపం.. వెంటనే దాన్ని బౌండరీకి బాదాడడం. దీంతో బంతి వేయాలంటనే బౌలర్లు జంకారు. మెక్ కల్లమ్ దూకుడుకు బౌలర్లు బెంబేలెత్తారు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన ఈ విధ్వంసకర బ్యాట్స్ మన్ 18 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. చివరకు వోక్స్ బౌలింగ్ లో మెక్ కల్లమ్(77) అవుటయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు 9 ఒవర్లలో 112/1గా ఉంది.