సాక్షి, ముంబై: భారత యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లను ఎదుర్కోవడం కష్టమైన పనేనని న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు నైపుణ్యం గల బౌలర్లని, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించారని ప్రశంసించారు. ఈనెల 22 నుంచి భారత్‌తో ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌లో పాల్గొనేందుకు ఇక్కడి వచ్చిన సందర్భంగా విలియమ్సన్ మీడియాతో ముచ్చటించారు. చైనామన్ బౌలర్లు అరుదుగా ఉంటారని, వారిని ఎదుర్కోవడం చాలెంజ్‌తో కూడుకున్నదన్నారు. ఇక కుల్డీప్, చాహాల్ బౌలింగ్ నైపుణ్యం చాలా బాగుందన్నారు. కానీ ఇక్కడి పరిస్థితులను అందిపుచ్చుకోవడమే మాకు పెద్ద సవాలని విలియమ్సన్ చెప్పుకొచ్చారు.
ఇక సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు జట్టులో లేకపోవడంపై విలియమ్సన్ ప్రశ్నించగా.. వారు లేకపోవడం మాకు కూడా ఆశ్చర్యం కలిగించిందన్నారు. కానీ భారత్‌లో ప్రతిభ కలిగిన క్రికెటర్లు ఉన్నారని, భారత్ ఈ మధ్య ఎక్కువ మ్యాచ్‌లు ఆడిందన్నారు. ప్రతి ఒక్కరు అన్ని ఫార్మాట్‌లు ఆడటం కష్టమని, బిజీ షెడ్యూల్ వల్ల కొందరికి విశ్రాంతి ఇవ్వడం క్రికెట్‌లో సహజమేనని అభిప్రాయపడ్డారు. మేము గత వేసవిలో ఇలాంటి పరిస్థితే ఎదుర్కొన్నామని చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో భారత్ మరింత దృడంగా తయారైందన్నారు. ఇక ఆస్ట్రేలియాపై కుల్‌దీప్ హ్యాట్రిక్ తీయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని విలియమ్సన్ కొనియాడాడు. గతేడాది సిరీస్ (3-2) చేజారడం నిరాశపరిచిందని, ఈ సారి అవకాశం ఇవ్వకూడదని కివీస్ ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నట్లు తెలిపారు. చాలా మంది ప్లేయర్లకు ఇక్కడ ఆడిన అనుభవం ఉందన్నారు.
కివీస్ కోచ్ మైక్ హెస్సన్ మాట్లాడుతూ.. ‘కుల్‌దీప్, చాహల్ బౌలింగ్‌ను ఐపీఎల్‌లో మా ఆటగాళ్లు చాల మంది ఎదుర్కొన్నారు. కొందరు కుల్‌దీప్ సహచరులుగా అతని మణికట్టు విద్యను గమనించారు. మణికట్టు స్పిన్నర్లు ఎక్కువగా పరుగుల ఇచ్చే అవకాశం కల్పిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మేం విజయవంతమైనట్లేనని’ మైక్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment