తొలిరౌండ్‌లోనే ఓడిన ఇవనోవిచ్
- ఏడో సీడ్‌కు షాక్ ఇచ్చిన సిబుల్కోవా
- యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ
న్యూయార్క్: టెన్నిస్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ యూఎస్ ఓపెన్‌లో తొలి రోజే సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో ప్రపంచ మాజీ నంబర్‌వన్, ఏడో సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టింది. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో డొమినికా సిబుల్కోవా (స్లొవేకియా) 6-3, 3-6, 6-3తో ఇవనోవిచ్‌ను బోల్తా కొట్టించింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సిబుల్కోవా ఏడు డబుల్ ఫాల్ట్‌లు చేసినప్పటికీ... ఇనోవిచ్ సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్ చేసి విజయాన్ని ఖాయం చేసుకుంది.
మరోవైపు ఇవనోవిచ్ ఆరు ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసి మూల్యం చెల్లించుకుంది. ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తొలి రౌండ్‌లోనే ఓడటం ఇవనోవిచ్‌కిది రెండోసారి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ఈ సెర్బియా సుందరి తొలి రౌండ్‌లోనే నిష్ర్కమించింది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో 15వ సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-2, 6-3తో సినియకోవా (చెక్ రిపబ్లిక్)పై, 13వ సీడ్ ఎకతెరీనా మకరోవా (రష్యా) 6-3, 6-3తో తెలియానా పెరీరా (బ్రెజిల్)పై విజయం సాధించి రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
పురుషుల సింగిల్స్ విభాగంలో 14వ సీడ్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం), 17వ సీడ్ గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో గాఫిన్ 6-4, 6-1, 6-2తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, దిమిత్రోవ్ 6-4, 6-2, 6-4తో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)పై గెలిచారు.
నేటి మ్యాచ్‌లు రాత్రి గం. 8.30 నుంచి
టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం