జడేజా... వచ్చాడు
* టెస్టు జట్టులోకి పునరాగమనం
* హర్భజన్‌కు విశ్రాంతి
* వన్డే జట్టులో అరవింద్ స్థానం
న్యూఢిల్లీ: పేలవ ఫామ్‌తో... చుట్టుముట్టిన విమర్శలతో భారత జట్టుకు దూరమైన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... ఘనంగా పునరాగమనం చేయబోతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 24 వికెట్లతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌ను సెలక్టర్లు తిరిగి జట్టులోకి ఆహ్వానించారు. దక్షిణాఫ్రికాతో జరిగే తొలి రెండు టెస్టులకు ప్రకటించిన 16 మంది సభ్యుల బృందంలో జడేజాకు చోటు దక్కింది.
ఈ నెలాఖరులో పెళ్లి చేసుకోబోతున్న హర్భజన్‌కు విశ్రాంతి ఇచ్చి జడేజాను జట్టులోకి తీసుకున్నారు. చివరిసారిగా 14 నెలల క్రితం జడేజా భారత్ తరఫున టెస్టు ఆడాడు. కోహ్లి సారథ్యంలో శ్రీలంకలో సిరీస్ గెలిచిన జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. గాయం కారణంగా ఆ సిరీస్‌లో చివరి టెస్టుకు దూరమైన కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు మురళీ విజయ్, శిఖర్ ధావన్ కూడా జట్టులోకి ఎంపికయ్యారు. నవంబరు 5 నుంచి భారత్, దక్షిణాఫ్రికాల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ మొదలవుతుంది.
ఇందులో తొలి రెండు టెస్టులకు జట్టును ప్రకటించారు. గాయం కారణంగా అశ్విన్ అందుబాటులో ఉంటాడో లేదో ఇప్పుడే చెప్పలేని స్థితి ఉన్నందున... ప్రస్తుతానికి తన పేరునూ ప్రకటించారు. మ్యాచ్‌ల సమయానికి ఫిట్‌గా ఉంటే జట్టులోకి తీసుకుంటారు.
దక్షిణాఫ్రికాతో తొలి రెండు టెస్టులకు జట్టు: కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, ధావన్, పుజారా, రహానే, రోహిత్, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, భువనేశ్వర్, ఉమేశ్, రాహుల్, బిన్నీ, ఆరోన్, ఇషాంత్.
ఉమేశ్‌పై వేటు
దక్షిణాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు జట్టులో ఒక్క మార్పు చేశారు. పేలవ ఫామ్ కారణంగా ఉమేశ్ యాదవ్‌ను తొలగించి అరవింద్‌ను జట్టులోకి తీసుకున్నారు. దక్షిణాఫ్రికాతో తొలి టి20 ద్వారా అరవింద్ భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇది మినహా ప్రస్తుతం ఉన్న జట్టులో మార్పులేమీ లేవు.
చివరి రెండు వన్డేలకు జట్టు: ధోని (కెప్టెన్), రోహిత్, ధావన్, రహానే, కోహ్లి, రైనా, అక్షర్, హర్భజన్, మిశ్రా, మోహిత్, భువనేశ్వర్, అరవింద్, బిన్నీ, రాయుడు, గుర్‌కీరత్.