జైపూర్‌కు తెలుగు టైటాన్స్ షాక్
ప్రొ కబడ్డీ లీగ్-2
జైపూర్: గతేడాది రన్నరప్ యు ముంబా చేతిలో ఆదివారం రాత్రి ఒక పాయింట్ తేడాతో ఎదురైన ఓటమి నుంచి తెలుగు టైటాన్స్ జట్టు వెంటనే తేరుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్‌తో సోమవారం జరిగిన ప్రొ కబడ్డీ లీగ్ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ అద్వితీయ ఆటతీరును ప్రదర్శించి అద్భుత విజయాన్ని దక్కించుకుంది. రైడింగ్‌లోనూ, డిఫెన్స్‌లోనూ తిరుగులేని విధంగా రాణించిన తెలుగు టైటాన్స్ జట్టు 33-22 పాయింట్ల తేడాతో జైపూర్‌ను చిత్తుగా ఓడించి నాలుగో విజయాన్ని దక్కించుకుంది. ఈ ఫలితంతో జైపూర్ ఖాతాలో వరుసగా నాలుగో ఓటమి చేరింది. రైడింగ్‌లో రాహుల్ చౌదరీ, దీపక్ హుడా, సుకేశ్ హెగ్డే చాకచక్యంగా వ్యవహరించి జైపూర్ ఆటగాళ్లను బోల్తా కొట్టించి నిలకడగా పాయింట్లు చేశారు.
రాహుల్ 11 పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలువగా... సుకేశ్ ఏడు, దీపక్ ఆరు, ప్రసాద్ మూడు పాయింట్లు సంపాదించారు. విరామ సమయానికి 8-7తో ఒక పాయింట్ ఆధిక్యంలోనే ఉన్న తెలుగు టైటాన్స్ రెండో అర్ధభాగంలో చెలరేగిపోయింది. మరో మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్ 33-18తో ఢిల్లీ దబాంగ్ జట్టును ఓడించింది. ఆద్యంతం దూకుడుగా ఆడిన బెంగళూరు విరామ సమయానికి 17-8తో స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. రెండో అర్ధభాగంలోనూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని బెంగళూరు తమ ఖాతాలో మూడో విజయాన్ని జమచేసుకుంది. మంగళవారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు బుల్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడుతుంది.