తెలుగు టైటాన్స్‌కు రెండో ఓటమి
జైపూర్ చేతిలో పరాజయం
ప్రొ కబడ్డీ లీగ్
జైపూర్: ఆరంభంలో నిలకడగా ఆడినా.. చివర్లో నిరాశపర్చిన తెలుగు టైటాన్స్ జట్టు... ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 28-24తో టైటాన్స్‌పై గెలిచింది. దీంతో టైటాన్స్ జట్టు రెండు పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. జైపూర్ తరఫున రాజేశ్ నర్వాల్ (8 పాయింట్లు) అత్యధిక పాయింట్లు సాధించగా, జస్వీర్ సింగ్, అమిత్ హుడా తలా మూడు పాయింట్లు తెచ్చారు. మహిపాల్ నర్వాల్ రెండు ట్యాకిల్ పాయింట్లతో రాణించాడు.
టైటాన్స్ టీమ్‌లో సందీప్ నర్వాల్ (6), వినోత్ కుమార్ (4), నీలేశ్ (4) రాణించగా, వినోద్ (3) ఒక్కడే క్యాచింగ్‌లో ఫర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో పట్నా పైరేట్స్ 36-34తో యు ముంబాపై నెగ్గింది. పట్నా ఆటగాడు ప్రదీప్ నర్వాల్ 18 రైడింగ్ పాయింట్లు సాధించగా, కుల్దీప్ సింగ్ (5), బాజీరావ్ (4)లు ట్యాకిల్‌లో అదరగొట్టారు. యు ముంబా తరఫున రిషాంక్ దేవడిగా (11), అనూప్ కుమార్ (6), సుర్జీత్ (3), రాకేశ్ (3), సునీల్ కుమార్ (3)లు ఆకట్టుకున్నారు. గురువారం జరిగే ఏకైక మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్‌తో బెంగళూరు బుల్స్ తలపడుతుంది.