హరియాణా, జైపూర్ మ్యాచ్ టై
సోనెపట్: ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్ నాలుగోసారి తమ మ్యాచ్‌ను ‘టై’ గా ముగించింది. గురువారం జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన మ్యాచ్ 27–27తో సమమైంది. ఈ మ్యాచ్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 17–9తో వెనకబడిన జైపూర్ చివర్లో పుంజుకుని ఓటమిని తప్పించుకుంది. హరియాణా స్టీలర్స్ ఓవరాల్‌గా 16 రైడ్ పాయింట్లు సాధించగా, జైపూర్ పింక్ పాంథర్స్ 19 రైడ్ పాయింట్లు రాబట్టింది. అయితే టాకిల్‌లో హరియాణా (9 పాయింట్లు) జైపూర్ (6 పాయింట్లు)పై పైచేయి సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో రెండు సార్లు ఆలౌటయ్యాయి. స్టీలర్స్ తరఫున రైడర్ దీపక్ కుమార్ దహియా (7 పాయింట్లు), సుర్జీత్ సింగ్ (6 పాయింట్లు), డిఫెండర్ వికాస్ (4 పాయింట్లు) రాణించారు. పింక్ పాంథర్స్ జట్టులో నితిన్ రావల్ (12 పాయింట్లు) రైడింగ్‌లో చెలరేగగా... పవన్ కుమార్ (4) ఆకట్టుకున్నాడు. నేడు జరిగే మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో తెలుగు టైటాన్స్, యు ముంబాతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ తలపడతాయి.