‘డబుల్’ ధమాకా ఎవరిదో!
• నేడు ప్రొ కబడ్డీ లీగ్ ఫైనల్
• పోరుకు సిద్ధమైన జైపూర్, పట్నా
• రెండో టైటిల్ లక్ష్యంగా బరిలోకి
సాక్షి, హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్‌లో ‘ఫైనల్ పంగా’కు రంగం సిద్ధమైంది. దాదాపు ఐదు వారాలుగా అభిమానులను అలరించిన కబడ్డీ వినోదం ఇప్పుడు అంతిమ సమరానికి చేరింది. ఆదివారం ఇక్కడి గచ్చిబౌలి స్టేడియంలో జరిగే సీజన్-4 ఫైనల్ మ్యాచ్‌లో తలపడేందుకు జైపూర్ పింక్ పాంథర్స్, పట్నా పైరేట్స్ జట్లు సన్నద్ధమయ్యాయి. మాజీ విజేత, డిఫెండింగ్ చాంపియన్ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు నెగ్గినా ప్రొ కబడ్డీ లీగ్‌ను రెండు సార్లు గెలుచుకున్న తొలి జట్టుగా నిలుస్తుంది. ఆఖరి పోరుకు ముందు మూడో స్థానం కోసం తెలుగు టైటాన్స్, పుణేరీ పల్టన్ మధ్య కూడా మ్యాచ్ జరుగుతుంది. మహిళల విభాగంలో కూడా ఆదివారమే ఫైర్‌బర్డ్స్, స్ట్రామ్ క్వీన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తారు.
కెప్టెన్ ముందుండి...
ప్రొ కబడ్డీ లీగ్ తొలి సీజన్ విజేత జైపూర్ పింక్ పాంథర్స్ తర్వాతి రెండు సీజన్లలో విఫలమైంది. అయితే ఈసారి చక్కటి ఆటతో మళ్లీ ఫైనల్లోకి అడుగు పెట్టింది. లీగ్ దశలో ఓడిన మ్యాచ్‌లలో కూడా జట్టు మంచి పోటీనిచ్చింది. ఎనిమిది పాయింట్ల తేడానే ఆ జట్టుకు సీజన్‌లో అతి పెద్ద ఓటమి. ఆ తర్వాత సెమీస్‌లో తెలుగు టైటాన్స్‌పై సాధించిన అద్భుత విజయం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. కెప్టెన్ జస్వీర్ సింగ్ ముందుండి జట్టును నడిపిస్తున్నాడు. సీజన్‌లో 69 రైడ్ పాయింట్లు సాధించిన అతను పాంథర్స్ తరఫున అగ్రస్థానంలో నిలిచాడు. డిఫెన్స్‌లో కూడా జట్టు రాణిస్తోంది. అమిత్ హుడా 44 టాకిల్ పాయింట్లతో సీజన్-4లో రెండో స్థానంలో నిలిచాడు. రాజేశ్ నర్వాల్, రాణ్ సింగ్, షబీర్ బాపులతో పింక్ టీమ్ పటిష్టంగా కనిపిస్తోంది. వ్యక్తిగత గణాంకాలపరంగా చూస్తే ఏ విభాగంలోనూ టాప్‌లో లేకున్నా జట్టుగా రాణించడం జైపూర్ జట్టుకు బలంగా మారింది.
వరుస విజయం కోసం...
డిఫెండింగ్ చాంపియన్ పట్నా పైరేట్స్ సీజన్ ఆసాంతం తమ ఆధిక్యం ప్రదర్శించింది. ఒక దశలో ఆ జట్టును ఓడించడం కష్టం అనే తరహాలో వరుస విజయాలు సాధించింది. చివరకు 10 విజయాలతో పట్టికలో అగ్రస్థానంతో ముగిం చిన పైరేట్స్, సెమీస్‌లో పుణేరీపై ఘన విజయం సాధించింది. ఇదే తరహా ఆటతీరు కనబరిస్తే వరుసగా రెండో టైటిల్ టీమ్ ఖాతాలో చేరుతుంది. రైడింగ్‌లో పర్‌దీప్ నర్వాల్ (88 పాయింట్లు) సత్తా చాటగా, డిఫెండర్‌గా అత్యధిక టాకిల్ పాయింట్లతో (44)తో ఫాజెల్ అత్రాచెలి నంబర్‌వన్‌గా నిలిచాడు. కెప్టెన్ ధర్మరాజ్ చేరలతన్, కుల్దీప్ సింగ్, రాజేశ్ మోండల్ ఇతర కీలక ఆటగాళ్లు.
మరోవైపు సొంతగడ్డపై టైటిల్ సాధించాలని ఆశించి భంగపడిన తెలుగు టైటాన్స్ పరువు నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. నేడు మూడో స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో పుణేరీ పల్టన్‌తో ఆడుతుంది. సెమీస్‌లో ఘోరంగా విఫలమైన రైడింగ్‌ను ఈ మ్యాచ్‌లో టైటాన్స్ సరిదిద్దుకుంటుందా చూడాలి.